NTV Telugu Site icon

China: కలిసి పనిచేసేందుకు సిద్ధం.. పీఎం మోడీకి చైనా ప్రధాని అభినందనలు..

Pm Modi

Pm Modi

China: భారత్-చైనాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను సరైన దిశలో ముందుకు తీసుకెళ్లేందుకు న్యూఢిల్లీలో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని బీజింగ్ తెలిపింది. మూడోసారి ఎన్నికైన ప్రధాని నరేంద్రమోడీకి చైనా ప్రధాని లీ కియాంగ్ మంగళవారం అభినందనలు తెలియజేశారు. రెండు దేశాల పటిష్టమైన, స్థిరమైన అభివృద్ధి రెండు దేశాల ప్రజల శ్రేయస్సుకు మాత్రమే కాకుండా, ఈ ప్రాంతం మరియు ప్రపంచ స్థిరత్వానికి సానుకూల శక్తిని ఇస్తుందని లీ కియాంగ్ తన సందేశంలో పేర్కొన్నట్లు చైనీస్ మీడియా నివేదించింది.

2024 ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి గెలిచి, ప్రధానిగా నరేంద్రమోడీ మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి గెలిచినందుకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ జూన్ 5న ప్రధాని మోడీకి అభినందనలు తెలియజేసింది. నాలుగేళ్ల క్రితం గాల్వాన్ ఘర్షణ తర్వాత రెండు దేశాల మధ్య దిగజారిన సంబంధాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఆరోగ్యకరమైన సంబంధాలపై దృష్టి పెట్టాలని పేర్కొంది.

Read Also: Khammam Crime: భూమి కోసం కూల్‌ డ్రింక్‌లో విషం కలిపి అక్కను చంపిన తమ్ముడు.. మూడేళ్ల తర్వాత వెలుగులోకి..

మే 5, 2020లో తూర్పు లడఖ్ సరిహద్దుల్లోని గాల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ ఏర్పడింది. దీని తర్వాత ఇరుదేశాల మధ్య సంబంధాలు సరిగా లేవు. పలుమార్లు సైనిక స్థాయిలో చర్చలు జరిగినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. ఇటీవల చైనా విదేశాంగ ప్రతినిధి మావో నింగ్ మాట్లాడుతూ.. ‘‘భారత సార్వత్రిక ఎన్నికల ఫలితాలను మేము గమనించాము మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి మరియు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ విజయానికి అభినందనలు తెలియజేస్తున్నాము’’ అని చెప్పారు. ఇదిలా ఉంటే మరోవైపు తైవాన్ ప్రెసిడెంట్ లై చింగ్ తే ప్రధాని మోడీ విజయానికి శుభాకాంక్షలు చెప్పడం, దీనికి మోడీ స్పందించడంపై చైనా రగిలిపోతోంది. తైవాన్ ‘‘వన్ చైనా విధానం’’లో అంతర్భాగమని పేర్కొంది. భారత్ దీనిని గౌరవించాలని కోరింది.