Site icon NTV Telugu

Lalu Prasad Yadav: 2024 ఎన్నికల్లో బీజేపీని తుడిచిపెడతాం..

Lalu

Lalu

Lalu Prasad Yadav: కిడ్నీ మార్పిడి ఆపరేషన్ నుంచి కోలుకుంటున్న ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ బీజేపీని హెచ్చరించారు. శనివారం జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి మహాగటబంధన్ ర్యాలీని ఉద్దేశిస్తూ వీడియోకాన్ఫరెన్స్ లో మాట్లాడారు. బీజేపీ దేశాన్ని కులం, మతం పేరుతో విభజించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశంలోని మైనారిటీలకు వ్యతిరేకం అని, మేము 2024 లోక్ సభ, 2025 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని తుడిచివేస్తాం అని అన్నారు.

బీజేపీ, ఆర్ఎస్ఎస్ రెండూ కూడా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నాయని, రాజ్యాంగాన్ని మార్చడానికి, రిజర్వేషన్లను అంతం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని లాలూ ఆరోపించారు. మా పోరాటం ఆర్ఎస్ఎస్ భావజాలంపై అని బీజేపీ దాని సూచనలను అనుసరిస్తోందని విమర్శించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికల్లో మొత్తం దేశం నుంచి తరిమికొడతామని అన్నారు.

Read Also: Turkey Earthquake: టర్కీలో మరోసారి భూకంపం.. 5.3 తీవ్రత నమోదు..

తన ఆరోగ్య పరిస్థితుల గురించి మాట్లాడుతూ..నేను ఈ ర్యాలీకి హాజరు కావాలని కోరుకున్నప్పటికీ.. నా ఆరోగ్య పరిస్థితులు నన్ను అనుమతించలేదని, నేను బాగా కోలుకున్నానని, ప్రజల ప్రార్థనలకు ధన్యవాదాలు తెలిపారు. నాకు కిడ్నీని ఇచ్చిన నా కుమార్తె రోహిణి ఆచార్యకు ఎప్పుడూ రుణపడి ఉంటానని లాలూ అన్నారు.

ఇదిలా ఉంటే బీహార్ సీఎం నితీష్ కుమార్ మాట్లాడుతూ..కాంగ్రెస్ చేతులు కలిపితే ప్రతిపక్షాలన్నీ కలిసి 2024 ఎన్నికల్లో బీజేపీని 100 సీట్లకే పరిమితం చేయవచ్చని మరోసారి అన్నారు. బీజేపీని దేశం నుంచి తుడిచిపెట్టేయడానికి నేను ప్రయత్నిస్తూనే ఉంటానని ఆయన అన్నారు. దీనికి ముందు బీహర్ పర్యటనలో ఉన్న కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా, జేడీయూ-కాంగ్రెస్-ఆర్జేడీ కూటమిని విమర్శించారు. తన ప్రధాని కలను నెరవేర్చుకోవడానికే నితీష్ కుమార్ ఆర్జేడీ, కాంగ్రెస్ లతో చేతులు కలిపారని దుయ్యబట్టారు. బీహార్ లో మరోసారి జంగిల్ రాజ్ ను తీసుకుని వచ్చారని.. దీన్ని అంతమొందించాలంటే బీజేపీకి మెజారిటీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.

Exit mobile version