India-Canada: భారత్ కెనడాల మధ్య మరోసారి దౌత్యయుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. ఖలిస్తానీ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారతీయ అగ్రశ్రేణి దౌత్యవేత్త సంజయ్ కుమార్ వర్మతో పాటు పలువురికి సంబంధం ఉందని కెనడా ఆరోపించింది. ఈ ఆరోపణలపై భారత్ తీవ్రంగా ఫైర్ అయింది. కెనడాలో తమ భారతీయ హైకమిషనర్‌తో సహా ఆరుగురిని విత్ డ్రా చేసుకుంటున్నట్లు ప్రకటించింది. మరోవైపు ఇండియాలో కెనడాకు చెందిన ఆరుగురు దౌత్యవేత్తలు శనివారం లోగా భారత్ వదిలి వెళ్లాలని ఆదేశించింది. ఈ పరిణామాలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు కనిష్ట స్థాయికి చేరుకున్నాయి.
అయితే, ఈ పరిణామాలు భారతీయ విద్యార్థులు, వీసాల ప్రక్రియపై ప్రభావితం చేయగలవు. కెనడాలో నిజ్జర్ హత్య ఫలితంగా ఇరు దేశాల సంబంధాలు చెడిపోయాయి. ఇది ఇప్పటికే అనుమతించబడిన వీసాల సంఖ్యలో కోతకు దారితీయవచ్చు. కెనడా ఇప్పటికే తన దౌత్యవేత్తల్లో మూడింట రెండు వంతుల మందిని భారత్ నుంచి ఉపసంహరించుకుంది. నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రయేయం ఉందని గతేడాది సెప్టెంబర్‌లో ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణల ఫలితంగా.. భారత్‌లోని దాని ఎంబసీ, కాన్సులేట్స్‌లో స్థానిక సిబ్బంది సంఖ్యను తగ్గించింది.
Read Also: Air India:న్యూఢిల్లీ-చికాగో ఎయిర్ ఇండియా విమానానికి బెదిరింపులు.. కెనడాకు దారి మళ్లింపు..
ఆ సమయంలో భారత్, కెనడా పౌరులకు వీసాల జారీని దాదాపుగా నెల రోజుల పాటు నిలిపేసింది. దీంతో కెనడియన్ పౌరులు ఇతర దేశాల్లోని భారతీయ మిషన్ల ద్వారా కూడా భారతీయ వీసా కోసం దరఖాస్తు చేసుకోలేకపోయారు. ఈ వీసాలు ఎక్కువగా భారత్‌లో ఉంటున్న తమ కుటుంబాలను కలవడానికి వచ్చే భారత సంతతికి చెందిన వారితో ముడిపడి ఉంది. ఇది కెనడాలోని భారతీయ ప్రవాసులకు తీవ్ర ఇబ్బందిని కలిగించింది. అయితే, చెల్లుబాటు అయ్యే ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI) కార్డ్ లేదా భారతదేశానికి చెల్లుబాటు అయ్యే దీర్ఘకాలిక వీసా ఉన్న భారతీయ సంతతి కెనడియన్లు ప్రభావితం కాలేదు. భారతదేశం నవంబర్ 2023లో క్రమంగా వీసా సేవలను పునఃప్రారంభించింది, మొదట వ్యాపార, వైద్య వీసాలకు ప్రాధాన్యత ఇచ్చింది.
కెనడా బెంగళూర్, చండీగఢ్, ముంబైలోని వీసా, వ్యక్తిగత కాన్సులర్ సేవల్ని తాత్కాలికంగా నిలిపేసింది. ఇదే కాకుండా కోవిడ్-19 తర్వాత ఇండియా, కెనడా ఇంకా డైరెక్ట్ ఎయిర్ కనెక్టివిటీని పునరుద్ధరించలేదు. శాశ్వత నివాసం, వర్క్ పర్మిట్లు, స్టడీ వీసాలతో వేల సంఖ్యలో భారతీయులు ప్రతీ ఏడాది కెనడా వెళ్తుంటారు. భారతీయ వలసదారులు ఎక్కువ వెళ్లే దేశాల్లో కెనడా ఒకటి. ఈ ఏడాది ప్రారంభంలో కెనడా అంతర్జాతీయ విద్యార్థి వీసాల సంఖ్యని రెండేళ్ల కాలానికి 3,60,000కి పరిమితం చేసింది. 2022 నుంచి 35 శాతం తగ్గించింది. ఆ దేశంలో అంతర్జాతీయ విద్యార్థుల జనాభాలో 41 శాతం పైగా భారతీయ విద్యార్థులే ఉన్నారు. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య దౌత్యవివాదం భారత దేశంలోని విద్యార్థుల్ని తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది.