Donald Trump: ప్రధాని నరేంద్రమోడీ ‘‘అద్భుత నాయకుడు’’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు కురిపించారు. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో బలమైన వాణిజ్య ఒప్పందం త్వరలో కుదురుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. “భారతదేశంతో గొప్ప ఒప్పందం కుదుర్చుకుంటాను” అని ఆయన అన్నారు. ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలపై ఆశావాదాన్ని నొక్కి చెప్పారు. రష్యన్ ఆయిల్ కొనుగోలు చేస్తుందనే కారణంతో ట్రంప్ ప్రభుత్వం భారత్‌పై 50 శాతం సుంకాలు విధించింది. అప్పటి నుంచి ఇరు దేశాల సంబంధాలు సున్నితంగా మారాయి.
Read Also: World Economic Forum : ప్రపంచంలోనే తొలి ‘స్విస్ మాల్’ హైదరాబాద్‌లో..!
భారత్, యూఎస్ మధ్య వాణిజ్య చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. ముఖ్యంగా వ్యవసాయం, పాడి పరిశ్రమల్లోకి తమకు యాక్సెస్ కావాలని అమెరికా కోరుతోంది. అయితే, దీని వల్ల భారతదేశంలో వ్యవసాయంపై ఆధారపడిన వారిపై ప్రభావం పడుతుందని కేంద్రం అడ్డుచెబుతోంది. గతేడాది ఫిబ్రవరిలో చర్చలు జరపడానికి అంగీకరించినప్పటి నుంచి రెండు దేశాలు ఒప్పందానికి దగ్గరగా ఉన్నామని చెబుతున్నాయి.