Rahul Gandhi: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించిన తర్వాత రాహుల్ గాంధీ వియత్నాం పర్యటకు వెళ్లడంపై బీజేపీ నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా మాజీ రాష్ట్రపతి, దివంగత నేత ప్రణబ్ ముఖర్జీ కుమార్తె షర్మిష్ట ముఖర్జీ కూడా రాహుల్ గాంధీ టార్గెట్‌గా విమర్శలు చేశారు. దేశమంతా శోకసంద్రంలో మునిగిపోయి ఉంటే, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ టూర్‌కి వెళ్లడాన్ని ప్రశ్నించారు.
‘‘దేశంలో ఒక సాధారణ పౌరుడిగా రాహుల్ గాంధీని ప్రశ్నించాలని అనుకుంటున్నాను. తన సొంత పార్టీకి చెందిన ఒక ప్రధాని మరణానికి దేశం సంతాపం వ్యక్తం చేస్తున్నప్పుడు అతను న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం వేరే ప్రాంతానికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది..? ఎందుకు వేచి ఉండలేకపోయారు..?’’ అని జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశ్నించారు.
Read Also: PM Modi: విశాఖ చేరుకున్న ప్రధాని మోడీ.. స్వాగతం పలికిన చంద్రబాబు, పవన్‌కల్యాణ్
షర్మిష్ట ముఖర్జీ మాట్లాడుతూ.. మన్మోహన్ సింగ్ అంత్యక్రియాలు నిర్వహించిన మరుసటి రోజు ఆయన చితాభస్మాన్ని సేకరించే కార్యక్రమానికి ఒక్క కాంగ్రెస్ నేత రాలేదని వార్తా కథనాల్లో చూశానని అన్నారు. మాజీ ప్రధాని చనిపోతే పార్టీ ఆయన కుటుంబానికి అండగా నిలవాల్సిన సమయమని, ప్రణబ్ ముఖర్జీ చనిపోయిన తర్వాత పార్టీ నేతల నుంచి వ్యక్తిగతంగా సానుభూతి పొందానని ఆమె చెప్పారు. కోవిడ్-9 సమయంలో చాలా మంది రాలేకపోయారు, అయితే ఇప్పుడు కోవిడ్ లేదు, రాహుల్ గాంధీ ఎందుకు వెళ్లారు..? అని ఆమె అడిగారు.
గత వారం రాహుల్ గాంధీ పర్యటనపై బీజేపీ కూడా విమర్శలు గుప్పించింది. “ప్రధాని మన్మోహన్ సింగ్ మరణానికి దేశం సంతాపం వ్యక్తం చేస్తుంటే, రాహుల్ గాంధీ కొత్త సంవత్సరం కోసం వియత్నాంకు వెళ్లారు. రాహుల్ గాంధీ ఆయన మరణాన్ని రాజకీయం కోసం వాడుకున్నాడు.’’ అని విమర్శించింది. గాంధీలకు, కాంగ్రెస్‌కి సిక్కులు అంటే ద్వేషమని బీజేపీ ధ్వజమెత్తింది. ఇందిరా గాంధీ దర్బార్ సాహిబ్‌ని అపవిత్రం చేసిందని ఎప్పటికీ మరచిపోవద్దని బీజేపీ గుర్తు చేసింది.