Annamalai: బీజేపీ నేత కే.అన్నామలై మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రేపై తీవ్రంగా స్పందించారు. ఠాక్రేల బెదిరింపులు తనను ముంబై రాకుండా అడ్డుకోలేవని సోమవారం అన్నారు. ఇటీవల, ముంబైలో శివసేన-ఎఎన్ఎస్ ర్యాలీలో అన్నామలైని ఎగతాళి చేస్తూ ఠాక్రేలు బెదిరించే వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందిస్తూ, “నన్ను బెదిరించడానికి ఆదిత్య థాకరే మరియు రాజ్ థాకరే ఎవరు?” అని ఆయన అన్నారు, రైతు కొడుకుగా ఉన్నందుకు తాను గర్విస్తున్నానని మరియు రాజకీయ బెదిరింపులకు భయపడనని అన్నామలై అన్నారు. “నేను ముంబైకి వస్తే నా కాళ్ళు నరికివేస్తామని కొందరు రాశారు. నేను ముంబైకి వస్తాను. నా కాళ్ళు నరికివేయడానికి ప్రయత్నించండి. అలాంటి బెదిరింపులకు నేను భయపడి ఉంటే, నేను నా గ్రామంలోనే ఉండేవాడిని” అని ఆయన అన్నారు.
తన వ్యాఖ్యలు మరాఠీల గొప్పతనాన్ని దెబ్బతీశాయనే ఆరోపణలను అన్నామలై ఖండించారు. ‘‘కామ రాజ్ భారతదేశంలో గొప్ప నాయకుడు అని చెబితు, ఆయన తమిళుడు కాకుండా పోతారా? ముంబై ప్రపంచస్థాయి నగరమని చెబితే, మహారాష్ట్రీయులు దానిని అభివృద్ధి చేయలేదని అర్థమా?’’ అని ప్రశ్నించారు. ముంబై ప్రతిష్ట మరాఠీ ప్రజల సహకారం నుంచి విడదీయరానిదని అన్నారు. తనను విమర్శిస్తున్నవారికి అజ్ఞానులు అని అన్నారు. ధోతులు, లుంగీలు వంటి వస్త్రధారణ హేళన చేయడాన్ని అన్నామలై ప్రశ్నించారు. తమిళుల్ని తక్కువగా చేసే శివసేన యూబీటీతో డీఎంకే పార్టీ పొత్తు ఉండటాన్ని ఆయన విమర్శించారు.
ఇటీవల, ముంబైలో ఎంఎన్ఎస్, శివసేన యూబీటీ సంయుక్త ర్యాలీలో రాజ్‌ఠాక్రే మాట్లాడుతూ.. ‘‘తమిళనాడు నుంచి ఒక రసమలై వచ్చాడు. ఇక్కడితో నీకు సంబంధం ఏమిటి? హటావో లుంగీ బజావో పుంగీ’’ అనే నినాదాన్ని ఉపయోగించారు. రసమలై అని హేళన చేయడంపై అన్నామలై ఠాక్రే పార్టీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.