NCP crisis: దేశరాజకీయాల్లో కీలక నేత, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ( ఎన్సీపీ) అధినేతగా ఉన్న శరద్ పవార్ ఆ పదవికి రాజీనామా చేశారు. అకాస్మత్తుగా ఆయన నిర్ణయం దేశాన్ని ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా మహరాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే రేపు ఎన్సీపీ పార్టీ కీలక భేటీ జరుగుతున్నట్లుగా తెలిసింది. ప్రముఖ రాజకీయ నాయకుడు శరద్ పవార్ రెండు రోజుల క్రితం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) చీఫ్‌గా రాజీనామా చేసిన తర్వాత ఆయన వారసుడు ఎవరన్నదానిపై ప్రశ్నలు వస్తున్నాయి.
Read Also: Somu Veerraju: హిందువుల మనోభావాలను దెబ్బ తీయడమే ప్రభుత్వం పనిగా పెట్టుకుంది..!
ఈ నేపథ్యంలో రేపు ముంబైలో జరిగే సమావేశంలో ఆయన వారసుడు ఎవరనేదానిపై స్పష్టత రావచ్చని తెలుస్తోంది. ఉదయం 11 గంటలకు సమావేశం ఉంటుందని ఎన్సీపీ వర్గాలు తెలిపాయి. ఒక వేళ శరద్ పవార్ తన రాజీనామా నిర్ణయంపై పునరాలోచించుకోకపోతే ఆయన కుమార్తె సుప్రియా సూలే పార్టీ అధినేత్రి అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఎన్సీపీలో శరద్ పవార్ తర్వాత కీలక నేతగా ఉన్న అజిత్ పవార్ కు కూడా అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే ఎన్సీపీని చీల్చి పార్టీ చీఫ్ గా మారాలనుకున్న అజిత్ పవార్ ఎత్తుగడలను గమనించిన నేపథ్యంలోనే శరద్ పవార్ రాజీనామా చేసి తిరుగుబాటును అణిచివేశారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ రాజకీయ పరిణామాల మధ్య గురువారం ఉదయం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, సుప్రియా సూలేకు ఫోన్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఒక వేళ అజిత్ ను కాదని సుప్రియా సూలేకు పగ్గాలు ఇస్తే ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయో చూడాలి. ఇప్పటికే అజిత్ పవార్ బీజేపీతో టచ్ లో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
