NTV Telugu Site icon

Waqf: ‘‘ముస్లింలు నమాజ్ చేసే ఏ స్థలమైనా వక్ఫ్ ప్రావర్టీనే’’.. తృణమూల్ ఎంపీ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్.

Kalyan Banerjee

Kalyan Banerjee

Waqf: కేంద్ర వక్ఫ్ సవరణ బిల్లును తీసుకువస్తోంది. ఇప్పటికే దీనిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో పార్లమెంట్ ఉభయసభలకు చెందిన అధికార, ప్రతిపక్ష ఎంపీలు సభ్యులుగా ఉన్నారు. ఈ శీతాకాల సమావేశాల్లోనే కమిటీ తన రిపోర్టుని పార్లమెంట్‌కి సమర్పించాల్సి ఉన్నా, కమిటీ కాల పరిమితిని వచ్చే ఏడాది బడ్జెట్ సమావేశాలకు పెంచారు. వక్ఫ్ బిల్లు ద్వారా వక్ఫ్ బోర్డుల అపరిమిత అధికారాలను కట్టడి చేయనున్నారు. అయితే, ప్రతిపక్షాలు మాత్రం ఇది మతస్వేచ్ఛని దెబ్బతీయడమే అంటూ కామెంట్స్ చేస్తున్నాయి.

Read Also: Maharashtra: కేంద్ర పరిశీలకులుగా నిరలమ్మ, విజయ్ రూపానీ! షిండే కుమారుడికి కీలక పదవి?

ఇదిలా ఉంటే, తాజాగా మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ కళ్యాణ్ బెనర్జీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. బెనర్జీ మాట్లాడుతూ.. ‘‘ముస్లింలు నమాజ్ చేసే ఏ ప్రదేశమైనా ఆటోమేటిక్‌గా వక్ఫ్ ఆస్తిగా పరిగణించబడుతుంది.’’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్ అవుతోంది. ఆయన వ్యాఖ్యల ప్రకారం.. నమాజ్ కోసం ఉపయోగించే రోడ్డు, రైల్వే ట్రాక్స్, విమానావ్రయాలు, పార్కులు, ఇతర ప్రాంతాలు, బహిరంగ ప్రదేశాలు వక్ఫ్ ప్రాపర్టీగా క్లెయిమ్ చేయవచ్చని సూచిస్తున్నాయని, కొల్‌కతాలో ముఖ్యమైన ప్రాంతాలతో సహా పెద్ద మొత్తంలో భూములు ముస్లిం సమాజానికి బదిలీ చేయబడుతున్నాయని బీజేపీ ఆరోపించింది.

ఓట్ల కోసం ఇలాంటివి ప్రోత్సహించినట్లైతే బెంగాలీ హిందూ సమాజం అనేక సవాళ్లను ఎదుర్కొంటుందని, వారి స్వస్థలమైన పశ్చిమ బెంగాల్ విడిచివేళ్లే ప్రమాదం ఉందని, పాకిస్తాన్-బంగ్లాదేశ్ వలే బెంగాల్లో హిందువులు పూర్తిగా నిర్మూలించేలా టీఎంసీ, మమతా బెనర్జీ చర్యలు చేపడుతున్నారని బీజేపీ నేత అమిత్ మాల్వియా ఆగ్రహం వ్యక్తం చేశారు. వక్ఫ్ బిల్లుని వ్యతిరేకిస్తూ టీఎంసీ ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిందని, కళ్యాణ్ బెనర్జీ ఇష్టానుసారంగా మాట్లాడటం లేదని, ఆయన మమతా ఉద్దేశాలనే చెబుతున్నాడని మాల్వియా ఆరోపించారు.