Udhayanidhi Stalin: తమిళనాడు సీఎం ఎంకే స్ఠాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మం’పై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఆయన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు, ముఖ్యంగా బీజేపీ పార్టీ, పార్టీ నేతలు విరుచుకుపడుతున్నారు. అయితే తాను ఆ వ్యాఖ్యలు కట్టుబడి ఉన్నానని ఉదయనిధి వివరణ ఇచ్చుకుంటున్నారు. తన వ్యాఖ్యలను బీజేపీ వక్రీకరించిందని ఆరోపించారు. తన మాటలకు కట్టుబడి ఉన్నానని, చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
ఉదయనిధి స్టాలిన్ చెన్నైలో జరిగిన రచయితల సమావేశంలో మాట్లాడుతూ.. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాలతో పోలుస్తూ..దాన్ని నిషేధించడం కన్నా నిర్మూలించాలని పిలుపునిచ్చారు. దీంతో ఈ వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. బీజేపీ, డీఎంకే పార్టీతో పాటు ఇండియా కూటమిని టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేస్తోంది.
ఈ వ్యాఖ్యలపై ఉదయనిధిని ప్రశ్నించిన సందర్భంగా ఆయన తన మాటలకు కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు.. ‘‘ నేను మారణహోమానికి పిలుపునిచ్చినట్లుగా కొందరు చిన్నపిల్లల్లా మాట్లాడుతున్నారు. మరికొందరు ద్రవిడవాదాన్ని తొలగించాలని అంటున్నారు. దీని అర్థం డీఎంకే వాళ్లను చంపాలనా..? కాంగ్రెస్ ముక్త్ భారత్ అని ప్రధాని పిలుపునిచ్చినప్పుడు, కాంగ్రెస్ వాళ్లు చంపబడ్డారా..? సనాతన అంటే ఏమిటి.. దీని అర్థం ఏది మారకూడని, శాశ్వతంగా ఉండాలని’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Read Also: New Delhi: విమాన సిబ్బంది నిర్లక్ష్యం.. అంధురాలిని లోపలే వదిలేసిన వైనం
‘‘ద్రవిడ మోడల్ మార్పు కోసం పిలుపునిచ్చింది. అందర్ని సమానంగా చూస్తుంది. బీజేపీ నా వ్యాఖ్యల్ని వక్రీకరించింది. నకిలీ వార్తలను ప్రచారం చేస్తోంది. ఇది వారికి అలవాటైన పని. బీజేపీ నాపై ఎలాంటి కేసులు పెట్టినా ఎదుర్కొనేందుకు సిద్ధం. బీజేపీకి ఇండియా కూటమి భయం పట్టుకుంది. ప్రజల దృష్టి మరల్చేందుకు ఇదంతా చేస్తోంది’’ అని ఉదయనిధి ఆరోపించారు.
కేంద్ర హోమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై ఉదయనిధి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండియా కూటమి హిందూమతాన్ని ద్వేషిస్తోందని అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండియా కూటమి ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతుందని ఆరోపించారు.
