Jairam Ramesh: బీజేపీ నేత ఎల్‌కే అద్వానీకి భారతరత్న ఇవ్వడంపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ స్పందించారు. ప్రధాని మోడీ, ఎల్‌కే అద్వానీకి సంబంధించి రెండు సంఘటనల గురించి ఆయన మాట్లాడారు. 2002లో నరేంద్రమోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అద్వానీ, ఆయనను కాపాడారని, ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మోదీని సీఎం పదవి నుంచి తప్పించాలనుకున్నారని, వాజ్‌పేయి మోడీకి రాజధర్మాన్ని గుర్తు చేశారని జైరాం రమేష్ అన్నారు. ఆ సమయంలో ఎల్‌కే అద్వానీ నరేంద్రమోడీకి అండగా నిలిచారని చెప్పారు.
Read Also: Ramleela play: సీతాదేవీ సిగరేట్ తాగుతున్నట్లుగా నాటక ప్రదర్శన.. ప్రొఫెసర్, విద్యార్థుల అరెస్ట్..
ఏప్రిల్ 5, 2014 గాంధీ నగర్ నుంచి మోడీ నామినేషన్ వేసేందుకు సిద్ధమైన సందర్భంలో.. ఎల్‌కే అద్వానీ, మోడీని తన శిష్యుడు కాదని, తెలివైన ఈవెంట్ మేనేజర్ అని అన్నారని జైరాం రమేష్ గుర్తు చేశారు. వీరిద్దరిని చూసినప్పుడు నాకు ఈ రెండు సంఘటనలు గుర్తుకు వస్తాయని ఆయన అన్నారు.
ఇదిలా ఉంటే, విపక్ష నేతలు అద్వానీకి భారతరత్నపై మిశ్రమంగా స్పందించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున దీన్ని స్వాగతించారు. కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ మాట్లాడుతూ.. ఎల్‌కే అద్వానీని పీఎం మోడీ, బీజేపీ ఆలస్యంగా గుర్తించిందని అన్నారు. బీజేపీ ఓట్లు చీలిపోకుండా అద్వానీకి భారతరత్న ఇచ్చిందని సమాజ్‌వాదీ నేత అఖిలేష్ యాదవ్ అన్నారు.