సోషల్ మీడియాలో డిజిటల్ కంటెంట్ పై నియంత్రణకోసం కొత్త నిబందనలను కేంద్రప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త నిబందనలు ఈరోజు నుంచి అమలులోకి వచ్చాయి. కేంద్రప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన కొత్త ఐటి నిబందనలు యూజర్ల గోప్యతకు భంగం కలిగించేవిగా ఉన్నాయని, వెంటనే కేంద్రం తీసుకొచ్చిన నిబందలను అడ్డుకోవాలని కోరుతూ వాట్సాప్ డిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దేశ భద్రతకు లేదా ప్రజలకు హాని కలిగించే విధంగా ఏవైనా పోస్టులను పెడితే ఆ వివరాలను ప్రభుత్వానికి తెలియజేసేలా కొత్త నిబందనలు తీసుకొచ్చారు. భారత రాజ్యాంగం ప్రకారం ఇది వ్యక్తుల గోప్యతకు భంగం కలిగించినట్టే అవుతుందని వాట్సాప్ అంటోంది. వాట్సాప్‌లో ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ సందేశాలు ఉన్నాయని, ఒకవేళ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆదేశాలను ఫాలో అయితే ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ సందేశాలను పక్కన పెట్టాల్సి వస్తుందని, వెంటనే కేంద్రం తీసుకోచ్చిన కొత్త ఐటీ నిబంధనలను అడ్డుకోవాలని ఢిల్లీ హైకోర్టును కోరింది వాట్సాప్.