NTV Telugu Site icon

Haryana Elections: ఏంటి ఇది..? హర్యానాలోని 20 స్థానాల్లో రీ-ఎలక్షన్ పిటిషన్‌పై సుప్రీం ఆగ్రహం..

Supremecourt

Supremecourt

Haryana Elections: ఇటీవల హర్యానా ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఈ రోజు నయాబ్ సింగ్ సైనీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే, హర్యానాలోని 20 అసెంబ్లీ స్థానాల్లో తిరిగి ఎన్నికలు నిర్వహించాలని దాఖలైన పిటిషన్‌ని గురువారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. నయాబ్ సింగ్ సైనీ ప్రమాణస్వీకారాన్ని నిలిపేసేందుకు నిరాకరించింది.

భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మసనం ఈ పిటిషన్‌ని తప్పుపట్టింది. ‘‘ఇవి ఎలాంటి పిటిషన్లు..? ఎన్నికైన ప్రభుత్వం ప్రభుత్వాన్ని ప్రమాణస్వీకారం చేయకుండా ఆపాలని మీరు కోరుకుంటున్నారా..? మేము ఈ పిటిషన్‌ని కొట్టివేస్తున్నాము’’అని సీజేఐ చంద్రచూడ్ అన్నారు.

Read Also: Yahya Sinwar: హమాస్ చీఫ్, అక్టోబర్ 07 దాడుల మాస్టర్ మైండ్ హతం.. ఇజ్రాయిల్ హిట్ లిస్టులో తొలిపేరు…

ఇటీవల జరిగిన ఎన్నికల్లో 90 స్థానాల్లో బీజేపీ 48 చోట్ల విజయం సాధించగా, కాంగ్రెస్ 37 స్థానాల్లో గెలుపొందింది. అక్టోబర్ 08న ఫలితాలు వెలువడిన తర్వాత, కాంగ్రెస్ ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసిందనే ఆరోపనణలు చేసింది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. తాము ఈ ఫలితాలను అంగీకరించమని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానించారు.

ప్రియా మిశ్రా, వికాస్ బన్సాల్ అనే ఇద్దరు పిటిషనర్ల తరుపున న్యాయవాది నరేందర్ మిశ్రా.. 20 నియోజకవర్గాల్లో ఈవీఎంలు లోపాలకు గురయ్యాయనే ఆందోళనని లేవనెత్తతూ అత్యవసరంగా విచారించాలని పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేయడాన్ని కూడా పిటిషనర్ ప్రస్తావించారు. అయితే, ఈ పిటిషన్‌కి తమకు సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇచ్చింది. పిటిషనర్లు ప్రియా మిశ్రా, వికాస్ బన్సాల్ తమను తాము కాంగ్రెస్ కార్యకర్తలమని చెప్పుకోవడంతో కాంగ్రెస్ పార్టీ దీనిపై వివరణ ఇచ్చింది. ఈ కేసుతో తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది.