Mood of the Nation survey 2026: దేశంలోని ప్రజల మానసిక స్థితిని అంచనా వేసే అత్యంత విశ్వసనీయ సర్వేల్లో ఒకటైన ఇండియా టుడే – సీ ఓటర్ ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ (MOTN) సర్వే తాజా గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. డిసెంబర్ 8, 2025 నుంచి జనవరి 21, 2026 మధ్య నిర్వహించిన ఈ సర్వేలో దేశవ్యాప్తంగా అన్ని వయసులు, కులాలు, మతాలు, జెండర్స్‌కు చెందిన 36,000 మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు. ఈ సర్వే భారత రాజకీయాలు, ప్రజల సమస్యలు, ఎన్డీఏ ప్రభుత్వ పనితీరుపై కీలక అవగాహనను ఇస్తోంది.
దేశంలో అతిపెద్ద సమస్య ఏంటి?
ఈ సర్వే ప్రకారం, ప్రస్తుతం భారతదేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యగా నిరుద్యోగం నిలిచింది. 26 శాతం మంది నిరుద్యోగమే ప్రధాన సమస్యగా అభిప్రాయపడ్డారు. 13 శాతం మంది ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణాన్ని తీవ్రమైన సమస్యగా పేర్కొన్నారు. 8 శాతం మంది రైతుల దుస్థితిని ముఖ్య సమస్యగా గుర్తించారు. 6 శాతం మంది కుటుంబ ఆదాయం తగ్గడం, పేదరికాన్ని ప్రస్తావించారు. 5 శాతం మంది అవినీతి, మహిళల భద్రత అంశాలను కీలకంగా పేర్కొన్నారు. అయితే, ఈ గణాంకాలు చూస్తే.. సామాన్యుడి రోజువారీ జీవితం ఉపాధి, ధరల పెరుగుదల, వ్యవసాయ సమస్యల చుట్టూనే తిరుగుతోందని స్పష్టమవుతోంది.
ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్న ప్రధాన అనుకూలతలు ఏంటి?
సర్వేలో ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయాలపై కూడా ప్రజల అభిప్రాయాలను సేకరించారు. అయితే, 16 శాతం మంది రాజకీయ స్థిరత్వాన్ని ఎన్డీఏ ప్రభుత్వ అతిపెద్ద బలంగా పేర్కొన్నారు. 12 శాతం మంది అయోధ్య రామమందిరం, కాశీ విశ్వనాథ్ కారిడార్ వంటి ఆధ్యాత్మిక ప్రాజెక్టులను కీలక విజయాలుగా అభిప్రాయపడ్డారు. 9 శాతం మంది మౌలిక సదుపాయాల అభివృద్ధి, అవినీతి తగ్గింపును పెద్ద విజయంగా చూశారు. 7 శాతం మంది ఆర్టికల్ 370 రద్దు, సంక్షేమ పథకాలను ఎన్డీఏ ముఖ్య విజయాలుగా పేర్కొన్నారు. రాజకీయ స్థిరత్వం, మౌలిక వసతుల అభివృద్ధి ఎన్డీఏకి ప్రధాన ప్లస్‌గా నిలుస్తున్నట్టు ఈ సర్వే సూచిస్తోంది.
ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రజల అసంతృప్తి..!
అయితే, ప్రభుత్వ వైఫల్యాల విషయంలోనూ ప్రజలు స్పష్టంగా స్పందించారు. 20 శాతం మంది ద్రవ్యోల్బణాన్ని ఎన్డీఏ ప్రభుత్వ అతిపెద్ద వైఫల్యంగా పేర్కొన్నారు. 17 శాతం మంది నిరుద్యోగంపై ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 9 శాతం మంది ఉగ్రవాద నియంత్రణ, ఆర్థికాభివృద్ధి లోపాలను ప్రభుత్వ బలహీనతలుగా గుర్తించారు. 5 శాతం మంది మత ఘర్షణలు, మైనారిటీల్లో భయాన్ని ప్రస్తావించారు. 3 శాతం మంది మహిళల భద్రతపై ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపారు.
ఈ సర్వే చెప్పే సారాంశం మొత్తంగా చూస్తే.. దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం సామాన్య ప్రజల ప్రధాన ఆందోళనలుగా ఉన్నప్పటికీ, రాజకీయ స్థిరత్వం, మౌలిక వసతుల అభివృద్ధి ఎన్డీఏ ప్రభుత్వానికి బలమైన అనుకూలతలుగా నిలుస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో ప్రజల తీర్పు ఈ అంశాల చుట్టూనే తిరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.