India-Canada Row: భారత్, కెనడాల మధ్య దౌత్యయుద్ధం తీవ్రమైంది. ఇరు దేశాలు కూడా తమతమ రాయబారుల్ని ఆయా దేశాల నుంచి విత్ డ్రా చేసుకున్నాయి. ఖలిస్తానీ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత అగ్రశ్రేణి దౌత్యవేత్త సంజయ్ కుమార్ వర్మతో పాటు పలువురుకి సంబంధాలు ఉన్నాయని కెనడా ఆరోపించడంతో ఉద్రిక్తత పెరిగింది. గతేడాది కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆ దేశ పార్లమెంట్‌లో మాట్లాడుతూ.. నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని ఆరోపించడంతో వివాదం మొదలైంది. ఆ సమయంలో భారత్ ఈ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించింది. ‘‘కెనడావి పూర్తిగా అసంబద్ధ, ప్రేరేపిత వ్యాఖ్యలు’’గా కొట్టిపారేసింది. ఆ దేశం ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిందని చెప్పింది.
అయితే, తాజాగా మరోసారి వివాదం చెలరేగడంపై భారత్ మరింత కఠినంగా వ్యవహరించింది. భారత్ లోని కెనడా రాయబారులు ఆరుగురిని దేశం వదిలివెళ్లాలని ఆదేశించింది. జస్టిన్ ట్రూడో కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, కెనడాలోని సిక్కు ఓట్ల కోసం భారత్‌ని టార్గెట్ చేస్తున్నాడని భారతదేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. మరోవైపు కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ మాట్లాడుతూ.. భారతదేశంపై ఆంక్షలు విధించడాన్ని కెనడా పరిశీలిస్తుందని..‘‘ప్రతీది టేబుల్‌పై ఉంది’’ అని ఆమె అన్నారు.
Read Also: Director Son: హీరోగా ఎంట్రీకి రెడీ అవుతున్న స్టార్ డెరైక్టర్ కొడుకు!
కెనడా ఒక వేళ భారత్‌పై ఆంక్షలు విధిస్తే, కెనడాని దెబ్బతీసేందుకు భారత్ కూడా కొన్ని ఆప్షన్లతో సిద్ధింగా ఉంది.
1) ప్రస్తుతం కెనడాలో 2 లక్షలకు పైగా భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. కెనడాలో చదువుకునేందుకు వెళ్లే భారత విద్యార్థులను భారత్ అడ్డుకుంటే, కెనడాలోని విద్యా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది.
2) ఖలిస్తాన్ అంశాలకు మద్దతు ఇస్తున్న భారతీయ సంతతికి చెందిన కెనడియన్ పౌరుల ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా(ఓఐసీ) కార్డులను భారత్ రద్దు చేయగలదు.
3) ఖలిస్తానీ మద్దతుదారుల ఆస్తి హక్కులను సస్పెండ్ చేయవచ్చు. కొత్త వీసాలను ఆలస్యం చేయడంతో పాటు నిఘాను పెంచడం చేయవచ్చు. ఈ చర్యలు ఖలిస్తానీ ఉద్యమ మద్దతుదారులు తమ వైఖరని మార్చుకునే అవకాశం ఉంటుంది.
4) భారత సంతతికి చెందిన అనుమానిత కెనడియన్ పౌరులకు భారత్ మల్టిపుల్ ఎంట్రీ వీసాలను రద్దు చేయవచ్చు. ఇది కెనడియన్ ఇండియన్ కమ్యూనిటీలో ప్రభావం చూపిస్తుంది. ఇది కెనడా రాజకీయాలను కూడా ప్రభావితం చేయవచ్చు.
5) ఇండియా కెనడాపై వాణిజ్య ఆంక్షలు విధించవచ్చు. ఎలాగైతే భారత్‌పై కెనడా ఆంక్షలు విధించాలని ఆలోచిస్తుందో అదే పని భారత్ చేయవచ్చు. టాప్-10 వ్యాపార భాగస్వామిగా ఉన్న భారత్, కెనడా ఆర్థిక వ్యస్థను తీవ్రంగా దెబ్బతీయవచ్చు. ప్రస్తుతం ఇండియాకు అనుకూలంగా ట్రేడ్ బ్యాలెన్స్ ఉంది. ఇదే కాకుండా భారత్‌లోని కెనడా ఆర్థిక సంస్థలు, పెన్షన్స ఫండ్స్ పెట్టుబడుల్ని భారత్ స్తంభింపచేయవచ్చు.