Eknath Shinde: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాలు హీట్ ఎక్కాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ క్రమంలో సీఎం ఏక్‌నాథ్ షిండే మాట్లాడుతూ.. ఎన్సీపీ నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్యకు సంబంధించిన నిందితులను ఎవరి కూడా వదిలి పెట్టేది లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.. ఈ ఘటన చాలా దురదృష్టకరం అని చెప్పుకొచ్చారు. ఈ హత్యకు సంబంధించిన పలువురు నిందితులు ఇప్పటికే అరెస్ట్ చేశాం.. ఇందులో భాగస్వాములైన వారిపై సర్కార్ కఠిన చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి షిండే వెల్లడించారు.
Read Also: Unique Tradition: వైరెటీ సంప్రదాయం.. ఆవుల మందతో తొక్కించుకుంటున్న యువకులు
ఇక, ఈ సందర్భంగా శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేపై సీఎం ఏక్ నాథ్ షిండే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నేను మహావికాస్ అఘాడి సర్కార్ లో భాగస్వామిగా ఉండేవాణ్ణి.. ఆ ప్రభుత్వం బాలాసాహెబ్ ఠాక్రే ఆశయాలకు విరుద్ధంగా పని చేసింది.. శివసేన, బీజేపీ పార్టీలు సరైన మార్గంలోనే వెళ్తున్నాయి.. ఉద్ధవ్ ఠాక్రే ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే కాంగ్రెస్‌తో జత కట్టాయని ఆరోపించారు. ఇది బాలాసాహెబ్ ఠాక్రే ఎప్పుడూ కోరుకోలేదని ఆయన పేర్కొన్నారు. శివసేన కార్యకర్తలుగా పార్టీ క్రమశిక్షణను అనుసరిస్తూ.. మార్పు అవసరమని గ్రహించాం.. అందులో భాగంగానే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామన్నారు. ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవ చేయడం అంటే ఆఫీసులో ఉండి.. ఫేస్‌బుక్ లైవ్‌లో సర్కార్ నడపడం కాదని విమర్శించారు. ప్రజల మధ్యలో ఉండి పాలన చేయాలని ఉద్ధవ్ ఠాక్రేను ఉద్దేశించి ఏక్ నాథ్ షిండే విమర్శలు గుప్పించారు. ఇక, మొత్తం 288 స్థానాలకు ఈనెల 20న ఎన్నికలు జరగనుండగా.. 23న తుది ఫలితాలు వెల్లడించనున్నారు.