Site icon NTV Telugu

Nitin Gadkari: ప్రతిపక్షాలను ఏకం చేసింది మేమే

Nitin Gadkari

Nitin Gadkari

Nitin Gadkari: దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసిన ఘనత తమదేనని కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్‌ నాయకులు నితిన్‌ గడ్కరీ అన్నారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలోనే కాంగ్రెస్‌తోపాటు 26 ప్రతి పక్ష పార్టీలు ఇండియా(I.N.D.I.A) కూటమిగా ఏర్పడ్డాయని తెలిపారు. ఈ పార్టీలన్నీ ఏకమయ్యేలా చేసిన ఘనత బీజేపీదేనని అన్నారు. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం కాంగ్రెస్, జేడీయూ, డీఎంకే వంటి 26 పార్టీలు ఇండియా (I.N.D.I.A) కూటమిగా ఏర్పడ్డాయని, ఈ పార్టీలన్నీ ఏకమయ్యేలా చేసిన ఘనత తమదేనని కేంద్ర మంత్రి చెప్పారు. ఒక మీడియా సంస్థ నిర్వహించిన ‘ఆజ్ తక్ జీ20 సదస్సు’లో శనివారం ఆయన మాట్లాడారు.

Read also: Nidhi Agarwal : ప్రభాస్ సరసన నటించబోతున్న హాట్ బ్యూటీ..?

మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు నితిన్ గడ్కరీ సమాధానం చెబుతూ.. ప్రతిపక్షాల ఐక్యతకు రూపశిల్పి బీజేపీయేనని చెప్పారు. సిద్ధాంతాలు కలవనివారు.. ఒకరి ముఖం మరొకరు చూసుకోనివారు.. కలిసి కూర్చుని కనీసం టీ తాగని వారు ఇప్పుడు బీజేపీపై పోరాటానికి సిద్ధమయ్యారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టబోతున్న కొత్త ప్రాజెక్టుల గురించి చెబుతూ.. కశ్మీరును కన్యా కుమారితో అనుసంధానం చేయడం కోసం ఎక్స్‌ప్రెస్‌వేను నిర్మిస్తామని తెలిపారు. యాక్సెస్ కంట్రోల్ రోడ్ ద్వారా ఈ రహదారిని నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోందని స్పష్టం చేశారు. ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉందని తెలిపారు. ద్వారక ఎక్స్‌ప్రెస్‌వేను నిర్మించడానికి ఎక్కువ ఖర్చు చేస్తున్నారని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) నివేదిక వెల్లడించిన నేపథ్యంలో .. దానిపై నితిన్ గడ్కరీ స్పందిస్తూ.. కాగ్‌ నివేదికలో చెప్పినట్లుగా ఈ మార్గం పొడవు 29 కిలోమీటర్లు కాదని.. అది 230 కిలోమీటర్ల పొడవైన మార్గమని తెలిపారు. దానిలో సొరంగాలు కూడా ఉన్నాయని, ఒక్కొక్క కిలోమీటరుకు రూ.9.5 కోట్లు ఖర్చు చేస్తున్నామని, ఈ విషయాన్ని తాను కాగ్ అధికారులకు వివరించానని చెప్పారు. కాగ్ నివేదిక ప్రకారం, ద్వారక ఎక్స్‌ప్రెస్‌వే పొడవు 29.06 కిలోమీటర్లు. ఒక్కొక్క కిలోమీటరు రోడ్డు నిర్మాణానికి రూ.250.77 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అయితే ఆర్థిక వ్యవహారాలపై కేంద్ర కేబినెట్ కమిటీ ఒక్కొక్క కిలోమీటరు రోడ్డు నిర్మాణానికి రూ.18.2 కోట్లు మాత్రమే మంజూరు చేసింది. అత్యధిక ఖర్చుతో రోడ్డును నిర్మిస్తున్నారని ఈ నివేదికలో పేర్కొనగా.. ఈ ఆరోపణలను నితిన్ గడ్కరీ ఖండించారు. నివేదికలో అన్ని విషయాలు కరెక్ట్ కాదన్నారు.

Exit mobile version