NTV Telugu Site icon

Canada: ఖలిస్తానీ ఉగ్రవాది పన్నూ బెదిరింపులపై స్పందించిన కెనడా..

Khalistani Terrorist

Khalistani Terrorist

Canada: ఖలిస్తాన్ ఉగ్రవాది, సిక్ ఫర్ జస్టిస్(ఎస్‌జేఎఫ్) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ ఇటీవల భారత్‌ను బెదిరిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. నవంబర్ 19న ఎయిరిండియా విమానాల్లో సిక్కులు ఎవరూ ప్రయాణించొద్దని, ప్రయాణిస్తే ప్రాణాలకు భద్రత ఉండదని, ప్రపంచవ్యాప్తంగా ఆ విమానాలను ఎక్కడా అనుమతించబోమని హెచ్చరించారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయం మూతపడుతుందని, దాని పేరు మారుస్తామని హెచ్చరించారు.

Read Also: Seediri Appalaraju: పురంధేశ్వరి చంద్రముఖిగా మారారు.. టీడీపీలో చేరితే సరిపోతుంది కదా..?

అయితే ఈ వ్యాఖ్యలపై కెనడా స్పందించింది. గురుపత్వంత్ సింగ్ పన్నూ వ్యాఖ్యలపై విచారణ జరుపుతున్నట్లు కెనడా ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు కెనడా రవాణా శాఖ మంత్రి పాబ్లో రోడ్రిగ్జ్ శుక్రవారం మాట్లాడుతూ.. మేం ప్రతి ముప్పును తీవ్రంగా పరిగణిస్తున్నాం, ముఖ్యంగా విమానయాన సంస్థలను హెచ్చరిస్తూ వచ్చిన బెదిరింపులపై కెనడా విచారణ జరుపుతున్నట్లు రోడ్రిగ్జ్ తెలిపారు.
ఇదిలా ఉంటే ఖలిస్తాన్ ఉగ్రవాది బెదిరింపుల నేపథ్యంలో ఢిల్లీ, పంజాబ్ విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. కెనడాలో దాదాపు 7 లక్షల మంది సిక్కులు ఉన్నారు. వీరు కెనడాలో జనాభాలో 2 శాతం ఉన్నారు.

జూన్ నెలలో కెనడాలోని సర్రే ప్రాంతంలో ఖలిస్తాన్ ఉగ్రవాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్‌ని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. అయితే ఈ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల పాత్ర ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడంతో, భారత్-కెనడాల మధ్య దౌత్యవివాదం నడుస్తోంది. కెనడాలోని భారత సీనియర్ దౌత్యవేత్తను బహిష్కరించారు. అయితే కెనడా చర్యలకు ప్రతిచర్యగా భారత్ కూడా తీవ్రంగానే స్పందించింది. భారత్ లోని కెనడియన్ దౌత్యవేత్తను బహిష్కరించింది. దీంతో పాటు కెనడాలో, ఇండియాలో దౌత్యవేత్తలు సమానంగా ఉండేలా 41 మంది కెనడా దౌత్యవేత్తలు దేశం వదిలివెళ్లాలని ఆదేశించింది.