NTV Telugu Site icon

Vinesh Phogat: వినేష్ ఫోగట్ సంచలన వ్యాఖ్యలు.. మోడీ ఫోన్ చేస్తే పట్టించుకోలేదని వ్యాఖ్య

D

D

భారత స్టార్ రెజ్లర్, కాంగ్రెస్ నేత వినేష్ ఫోగట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పారిస్ ఒలింపిక్స్‌ ఫైనల్‌లో అనర్హతకు గురైనప్పుడు ప్రధాని మోడీ నుంచి ఫోన్ కాల్ వస్తే మాట్లాడేందుకు నిరాకరించినట్లు తెలిపారు. ఒక ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

పారిస్ ఒలింపిక్స్‌లో 100 గ్రాముల బరువు కారణంగా వినేష్ ఫోగట్ అనర్హత వేటు పడింది. దీంతో ఆమెను ఓదార్చడానికి ప్రధాని మోడీ ఫోన్ నుంచి కాల్ వచ్చింది. అయితే తాను మాట్లాడటానికి నిరాకరించినట్లు వినేష్ తెలిపారు. తనకు నేరుగా మోడీ నుంచి ఫోన్ కాల్ రాలేదన్నారు. అక్కడ ఉన్న భారత అధికారులు తన దగ్గరకు వచ్చి మోడీ మాట్లాడాలనుకుంటున్నారని చెప్పారు. అందుకు సిద్ధంగానే ఉన్నానని.. కానీ అధికారులు మాత్రం షరతులు పెట్టారని చెప్పారు. తన బృందం నుంచి ఎవరూ మాట్లాడకూడదని.. ప్రధాని మోడీ నుంచి మాత్రం ఇద్దరు వ్యక్తులు సోషల్ మీడియా కోసం సంభాషణను రికార్డ్ చేస్తారని చెప్పారు. ఈ పరిణామం తనకు రుచించలేదన్నారు. అసలే నిష్క్రమణకు గురైన బాధతో ఉంటే.. తన భావోద్వేగాలను, కృషిని సోషల్ మీడియాలో ఎగతాళి చేసుకోవడానికి ఇష్టపడలేదని ఆమె చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి: Israel: ఇజ్రాయెల్‌కు భారీ ఎదురుదెబ్బ.. లెబనాన్‌లో 8 మంది సైనికుల మృతి

ఎలాంటి షరతులు లేకుండా ప్రధాని మోడీ నేరుగా ఫోన్ చేసి ఉంటే మాట్లాడేదాన్ని అని వివరించారు. అంతేకాకుండా తప్పకుండా అభినందించేదానిని అని పేర్కొన్నారు. నిజంగా అథ్లెట్ల గురించి శ్రద్ధ వహిస్తే రికార్డు చేయకుండా కాల్ చేసే ఉండేవారన్నారు. అప్పుడు తాను కృతజ్ఞత కలిగి ఉండేదాన్ని అని వివరించారు. ‘‘నాతో మాట్లాడితే గత రెండేళ్ళ గురించి అడుగుతానని పీఎం మోడీకి తెలిసి ఉండవచ్చు. బహుశా అందుకే నా వైపు నుంచి ఫోన్ మాట్లాడే బృందం ఉండకూడదని అధికారులు సూచించారు. ఇలా అయితే.. వారు మాట్లాడిన వీడియో వారికి అనుకూలంగా ఎడిట్‌ చేయడానికి అవకాశం ఉండదు. మాములుగా మాట్లాడితే.. నేను ఒరిజినల్‌ కాల్‌ను బయటపెడతానని వారికి తెలుసు’’ అని వినేష్ ఫోగట్ అన్నారు.

పారిస్ ఒలింపిక్స్ నుంచి ఇంటికి చేరుకున్నాక ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం హర్యానాలోని జులానా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అక్టోబర్ 5న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం అక్టోబర్ 8న విడుదల కానున్నాయి.

ఇది కూడా చదవండి: KTR: కొండా సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసులు