NTV Telugu Site icon

Rajasthan: రాజస్థాన్ సీఎంపై ఉత్కంఠ..60 మంది ఎమ్మెల్యేలకు వసుంధర రాజే ఫోన్..

Vasundhara Raje

Vasundhara Raje

Rajasthan: రాజస్థాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారం నుంచి దించేసింది బీజేపీ. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 199 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 115 సీట్లు గెలుచుకుంది. అయితే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. గతంలో బీజేపీ తరుపున ముఖ్యమంత్రిగా పనిచేసిన వసుంధర రాజేనే ముఖ్యమంత్రిగా చేస్తారా..? లేకపోతే కొత్తవారిని సీఎం సీటు వరిస్తుందా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

అయితే ఈ సారి వసుంధర రాజేకు బీజేపీ చెక్ పెట్టాలని భావిస్తున్నట్లు అంతర్గత వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో యూపీలో యోగి ఆదిత్యనాథ్ తరహాలో రాష్ట్రంలో కూడా యోగి బాబా బాలక్ నాథ్‌‌కి బీజేపీకి సీఎం పగ్గాలు అప్పగించే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. వీరితో పాటు మరొకొందరి పేర్లను బీజేపీ పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Read Also: Kamal Nath: “ఎమ్మెల్యేలకు సొంతూళ్లలో 50 ఓట్లు రాలేదు”.. ఇది ఎలా సాధ్యం..

ఇదిలా ఉంటే వసుంధర రాజే సీఎం సీటు కోసం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. మంగళవారం 68 మంది ఎమ్మెల్యేలకు వసుంధర రాజే ఫోన్ చేసి తనను కలవాలని చెప్పినట్లు తెలుస్తోంది. బలప్రదర్శనలో భాగంగా రాజేని ఇప్పటి వరకు 28 మంది ఎమ్మెల్యేలు కలిశారని, అయితే ఇందులో కొంతమంది స్వతంత్రులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఎమ్మెల్యేలు మాత్రం తాము మర్యాదపూర్వకంగా కలిశామని, పార్టీ నాయకత్వం రాజేని రాష్ట్రంలో సీఎం పదవికి ఎంచుకుంటే మద్దతు ఇస్తామని చెప్పారు.

వసుంధర రాజేతో పాటు ఝల్రాపటన్ స్థానం నుంచి గెలిచిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, అర్జున్ మెఘ్వాల్, బాబా బాలక్ నాథ్, వసుంధర రాజేలాగే రాజవంశీయురాలైన దియా కుమారి కూడా ముఖ్యమంత్రి పదవికి పోటీలో ఉన్నారు. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు బీజేపీ రాష్ట్ర ఇంఛార్జ్ అరుణ్ సింగ్, బీజేపీ చీఫ్ సీపీ జోషి పార్టీ హైకమాండ్‌ని కలిసేందుకు ఢిల్లీ వెళ్లారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో వీరు భేటీ కానున్నారు. పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యేందుకు షెకావత్, బాలక్ నాథ్ కూడా ఢిల్లీకి చేరుకున్నారు. వసుంధర రాజే 2003 నుంచి 2008 వరకు, 2013-18 వరకు రెండు సార్లు రాజస్థాన్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.