USAID Row: అమెరికాలోని గత బైడెన్ ప్రభుత్వం భారత ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించిందంటూ ఇటీవల డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. USAID ద్వారా 21 మిలియన్ డాలర్ల నిధులను భారత్‌లో ‘‘ఓటర్ల ఓటు’’ కోసం కేటాయించారని ట్రంప్ ఆరోపించారు. 2024 భారత లోక్‌సభ ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించారనే ఆరోపణల నడుమ అధికార బీజేపీ కాంగ్రెస్‌పై విరుచుకుపడుతోంది.
ఇదిలా ఉంటే, తాజాగా వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనంలో ఈ 21 మిలియన్ డాలర్ల నిధుల గురించి ఎలాంటి రికార్డులు లేవని నివేదించింది. భారతదేశానికి అమెరికా నిధులు ఇచ్చిందని ఇటీవల డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ(DOGE) పేర్కొంది. వాషింగ్టన్ పోస్ట్ డోజ్ వాదనల్ని తోసిపుచ్చింది. USAID బంగ్లాదేశ్ కోసం $21 మిలియన్ల ఒప్పందాన్ని కలిగి ఉందని అమెరికన్ దినపత్రిక పేర్కొంది.
2008 నుంచి ఎన్నికలకు సంబంధించిన ఏ ప్రాజెక్టుకు SAID నుండి భారతదేశం నిధులు పొందలేదని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రాసిన ఇలాంటి కథనాన్ని వాషింగ్టన్ పోస్ట్ నివేదిక సమర్థించింది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం బీజేపీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర రాజకీయ వివాదానికి కారణమైంది. వాషింగ్టన్ పోస్ట్ నివేదికను ప్రస్తావిస్తూ, కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేరా మాట్లాడుతూ.. బీజేపీ, దాని అంధ మద్దతుదారులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్, రాహుల్ గాంధీలు విదేశీ సాయాన్ని కోరానని కాషాయ పార్టీ నేతలు ధ్వజమెత్తుతున్నారు. భారతదేశంలో ఓటర్ల సంఖ్యను పెంచడానికి అమెరికా నుంచి ఎలాంటి నిధులు రాలేదనన్న ది వాషింగ్టన్ పోస్ట్ కథనం కాంగ్రెస్‌కి ఆయుధంగా మారింది.