PM Modi: 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మెజారిటీ స్థానాలను సాధించింది. 543 ఎంపీ సీట్లు ఉన్న లోక్సభలో ఎన్డీయే 292 సీట్లను సాధించింది, బీజేపీ సొంతగా 240 సీట్లను సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ఈ నేపథ్యంలో మూడోసారి ప్రధాని పదవిని చేపట్టేందుకు నరేంద్రమోడీ సిద్ధమయ్యారు. జూన్ 8 లేదా 9న ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా పలు దేశాధినేతలు ప్రధాని నరేంద్రమోడీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బీజేపీ,ఎన్డీయే విజయంపై సంతోషాన్ని వ్యక్తం చేస్తు్న్నారు. తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రధాని మోడీ విజయంపై శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరియు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్(ఎన్డీయే) విజయానికి శుభాకాంక్షలు. ఈ చారిత్రాత్మక ఎన్నికల్లో దాదాపు 65 కోల మంది ఓటర్లకు అభినందనలు. అమెరికా-ఇండియా మధ్య స్నేహం మరింత పెరుగుతుంది’’ అంటూ ట్వీట్ చేశారు.
Read Also: Nitish Kumar: కనీసం 4 కేబినెట్ బెర్తులు కావాలి, నితీష్ కోరుతున్నది ఈ మంత్రిత్వ శాఖలనేనా.?
మరో అగ్రదేశం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ప్రధాని నరేంద్రమోడీకి అభినందనలు తెలియజేశారు. ‘‘సార్వత్రిక పార్లమెంటరీ ఎన్నికలలో ఇండియన్ పీపుల్స్ పార్టీ విజయం సాధించినందుకు దయచేసి నా హృదయపూర్వక అభినందనలను అంగీకరించండి. ఓటింగ్ ఫలితాలు మీ వ్యక్తిగత ఉన్నత రాజకీయ అధికారాన్ని, ప్రపంచ వేదికపై భారతదేశ వేగవంతమైన సామాజిక-ఆర్థిక అభివృద్ధి మరియు దాని ప్రయోజనాల పరిరక్షణకు మద్దతు ఉంటుంది. న్యూఢిల్లీతో ప్రత్యేకంగా విశేషమైన వ్యూహాత్మక భాగస్వామ్య సంబంధానికి మేము చాలా ప్రాముఖ్యతనిస్తాము. రష్యా మరియు భారతదేశం యొక్క స్నేహపూర్వక ప్రజల ప్రయోజనాలు సాంప్రదాయిక పరస్పర ప్రయోజనకరమైన సహకారాన్ని మరింతగా పెంపొందించడానికి కృతనిశ్చయంతో ఉన్నాము’’ అని పుతిన్ తన సందేశాన్ని ప్రధాని మోడీకి తెలిపారు.