US Tariffs: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ దేశంలోకి వచ్చే భారతదేశ ఉత్పత్తులపై విధించిన అదనపు 25 శాతం టారీఫ్స్ ఈరోజు (ఆగస్టు 1న) నుంచి అమల్లోకి రానున్నాయి. దీని ప్రభావంతో ఒక్క రత్నాభరణాల రంగంలోనే దాదాపు లక్ష మంది ఉద్యోగాలపై ప్రతికూల ప్రభావం పడబోతుందన్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. చేతితో తయారు చేసే ఆభరణాల ధరలు మరింత పెరిగి, అక్కడ అమ్ముడుపోక పోవచ్చని అఖిల భారత రత్నాభరణాల దేశీయ మండలి (AIGJDC) ఛైర్మన్ రాజేశ్ రోక్డే పేర్కొన్నారు. గతంలో అమెరికా 10 శాతం సుంకం విధించినపుడు సుమారు 50 వేల మంది ఉపాధి కోల్పోగా.. కొత్త టారిఫ్ అమలుతో లక్ష మందికి పైగా జీవితం రోడ్డునపడొచ్చు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది అత్యంత దురదృష్టకరమ’ని రోక్డే చెప్పుకొచ్చారు. ఐరోపా సమాఖ్య, పశ్చిమాసియా లాంటి ప్రత్యామ్నాయ మార్కెట్ల వైపు ఈ రంగం చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
Read Also: Kolkata: బంగ్లాదేశ్ మోడల్ శాంతా పాల్ అరెస్ట్.. పోలీస్ కస్టడీకి అప్పగింత
రాగి ఉత్పత్తులపై 50శాతం టారీఫ్స్..
అమెరికా పాక్షిక రాగి, రాగి ఆధారిత ఉత్పత్తులపై 50 శాతం టారీఫ్స్ విధించింది. 2024-25లో యూఎస్ కు మనదేశం 360 మిలియన్ డాలర్ల విలువైన రాగి ఉత్పత్తులను ఎగుమతి చేయగా.. ఇకపై వీటి ఉత్పత్తి తగ్గి, ధరలు పెరిగే అవకాశం ఉంది. అమెరికా నుంచి వచ్చే రాగి ఉత్పత్తులపై మనదేశం 2.5-10 శాతం సుంకమే విధించే అవకాశం ఉంది.
దుస్తుల ఎగుమతి తగ్గే ఛాన్స్..
తాజా సుంకాలతో దుస్తుల ఎగుమతులు తగ్గనుంది.. మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదిరే వరకూ ఈ పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. భారత్ కు చెందిన రెడీమేడ్ దుస్తుల ఎగుమతుల్లో అమెరికాకు చేరుతున్నవే 33 శాతం కావడం గమనార్హం. యూఎస్ దిగుమతి చేసుకునే దుస్తుల్లో భారత్ వాటా 2020లో 4.5% ఉండగా.. 2024లో 5.8 శాతానికి చేరుకుంది. చైనా, వియత్నాం, బంగ్లాదేశ్‌లకు కలిపి 49 శాతం వాటా ఉంది.
బియ్యం ఎగుమతులకు ఆటంకాలే..
భారతదేశానికి చెందిన బియ్యం ఎగుమతులకు ప్రస్తుత సుంకాలు తాత్కాలిక అడ్డంకిగా మారే ఛాన్స్ ఉంది. కానీ, వియత్నాం, పాకిస్థాన్ లాంటి పోటీ దేశాలతో పోలిస్తే బియ్యం ధర- నాణ్యత పరంగా భారత్‌దే పైచేయి అని బియ్యం ఎగుమతిదార్ల సమాఖ్య పేర్కొంది. భారత్‌కు అతిపెద్ద బాస్మతీ మార్కెట్ అమెరికా మాత్రం కాదు. 2023-24లో మనదేశం నుంచి 52.4 లక్షల టన్నుల బాస్మతీ బియ్యం ఎగుమతి అయింది.. అందులో అమెరికాకు 2.34 లక్షల టన్నులే.. భారత బియ్యంపై సుంకం(25%+) పోటీదార్లయిన చైనా (34%), వియత్నాం(46%), పాకిస్థాన్(29%), థాయ్‌లాండ్(36%) కంటే తక్కువే.