Site icon NTV Telugu

YouTube: ‘‘యూట్యూబ్’’లో చూసి, మహిళకు ఆపరేషన్ చేసి చంపేశారు..

Youtube Surgery Incident

Youtube Surgery Incident

YouTube: యూట్యూబ్, చాట్ జీపీటీ వంటి ఏఐ టూల్స్ వాడి సొంత వైద్యం చేసుకుంటే ఎంత ప్రమాదమో ఈ ఘటన తెలియజేస్తోంది. ఉత్తర్ ప్రదేశ్ లోని బారాబంకీలో ఒక మహిళకు యూట్యూబ్‌లో చూసి ఆపరేషన్ చేశారు. దీంతో ఆమె చనిపోయింది. అక్రమంగా క్లినిక్ నడుపుతున్న వ్యక్తి, అతడి మేనల్లుడు యూట్యూబ్ ట్యుటోరియల్‌లో చూసిన తర్వాత ఆమెకు శస్త్రచికిత్స చేయడం ప్రారంభించారు. తీవ్ర రక్తస్రావంతో ఆమె మరణించింది.

Read Also: Rahul Gandhi: రాహుల్ గాంధీ ‘‘పార్టీల’’ లీడర్.. బెర్లిన్ టూర్‌పై బీజేపీ విమర్శలు..

నిందితులిద్దరూ కూడా ఎలాంటి అనుమతులు లేకుండా క్లినిక్ నడుపుతున్నారని పోలీసులు తెలిపారు. తెహబహదూర్ రావత్ భార్య మునిశ్రా రావత్ అనారోగ్యంతో బాధపడుతోంది. డిసెంబర్ 5న ఆమె భర్త ఆమెను కోఠిలోని శ్రీ దామోదర్ క్లినిక్‌కు తీసుకెళ్లాడు. అక్కడ క్లినిక్ ఆపరేటర్‌గా ఉన్న జ్ఞాన్ ప్రకాష్ మిశ్రా.. మహిళ కడుపులో రాళ్ల వల్ల నొప్పి వచ్చిందని చెప్పి, ఆపరేషన్ చేయాలని సలహా ఇచ్చారు. ఈ ఆపరేషన్‌కు అయ్యే ఖర్చును తెలియజేశాడు. ఆపరేషన్‌కు ముందు, భర్త నుంచి రూ. 20,000 డిపాజిట్ చేయించుకున్నాడు.

మిశ్రా మద్యం మత్తులో ఉన్నాడని, యూట్యూబ్ వీడియో చూసిన తర్వాత ఆపరేషన్ ప్రారంభించినట్లు మహిళ భర్త తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన భార్య కడుపును చీల్చి, రక్త నాళాలను కోశాడని , ఆ తర్వాత డిసెంబర్ 6 సాయంత్రం ఆమె చనిపోయిందని ఆరోపించారు. మిశ్రా మేనల్లుడు వివేక్ కుమార్ మిశ్రా కూడా అతడికి సహాయం చేశాడు. వివేక్ కుమార్ రాయ్‌బరేలిలో ని ఒక ఆయుర్వేద ఆస్పత్రిల్లో ఉద్యోగం చేస్తున్నాడని, ప్రభుత్వ ఉద్యోగం ఉన్నప్పటికీ అక్రమంగా క్లినిక్ నడిపిస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఇప్పుడు ఘటనకు కారణమైన క్లినిక్‌ను పోలీసులు సీజ్ చేశారు. మిశ్రా, అతడి మేనల్లుడిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. వీరిద్దరిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Exit mobile version