Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం జరిగింది. యూపీకి చెందిన ఓ డాక్టర్ అనేక మంది పేషెంట్లకు ఒకే సిరంజిని వాడాడు. ఆ తరువాత ఓ అమ్మాయికి హెచ్ఐవీ పాజిటివ్ గా తేలింది. ఉత్తర్ ప్రదేశ్ లోని ఎటాహ్ లోని ఒక వైద్య కళాశాల వైద్యులు ఒకే సిరంజితో అనేక మందికి ఉపయోగించారు. అయితే ఈ ఘటనపై ఉత్తర్ ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ స్పందించారు. దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
వివరాల్లోకి వెళితే ఎటాహ్‌లోని రాణి అవంతీ బాయి లోధి ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో ఒక వైద్యుడు ఒకే సిరంజిని అనేకమంది పేషెంట్లకు ఉపయోగించాడు. దీని తర్వాత ఒక అమ్మాయికి హెచ్ఐవీ పాజిటివ్ గా తేలింది. ఒకే సిరంజి నుంచి పలువురు పిల్లలకు ఇంజక్షన్లు ఇచ్చారని శనివారం ఆస్పత్రిలో చేరిన బాలిక తల్లిదండ్రులు జిల్లా మేజిస్ట్రేట్ అంకిత్ కుమార్ అగర్వాల్‌కు ఫిర్యాదు చేశారు. అంతకుముందు ఫిబ్రవరి 20న బంధువులు బాలికను ఆస్పత్రిలో చేర్పించారు. అయితే చిన్నారికి హెచ్ఐవీ సోకిందని తేలడంతో ఆరోగ్య కార్యకర్తలు రాత్రికి రాత్రే చిన్నారిని బలవంతంగా ఆస్పత్రి నుంచి బయటకు పంపినట్లు బంధువులు ఆరోపించారు.
ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ దర్యాప్తుకు చీఫ్ మెడికల్ ఆఫీసర్ ను ఆదేశించారు. ఎటాహ్ లోని మెడికల్ కాలేజీలో డాక్టర్ చాలా మంది రోగులకు ఒకే సిరంజితో ఇంజెక్షన్ చేసిన తర్వాత, ఒక చిన్నారికి హెచ్ఐవీ పాజిటివ్ గా తేలింది. దీనిపై మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ను వివరణ కోరినట్లు ఉపముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ ట్వీట్ చేశారు.