Urination Incident In American Airlines: ఎయిరిండియా విమానంలో మూత్రవిసర్జన ఘటన దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అయిందో అందరికి తెలుసు. దీనిపై డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) కఠిన మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. తాజాగా మరోసారి ఇలాంటి ఘటనే రిపీట్ అయింది. న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానంలో మద్యం తాగిన మత్తులో ఓ ప్రయాణికుడు, మరో ప్రయాణికుడిపై మూత్రవిసర్జన చేశాడు. విమానం ల్యాండ్ అయిన వెంటనే నిందితుడిని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
Read Also: Rahul Gandhi: ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడులు.. బీబీసీ విషయంలో ఇదే జరిగింది..
AA292 అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం శుక్రవారం రాత్రి 9:16 గంటలకు న్యూయార్క్ నుండి బయలుదేరింది మరియు 14 గంటల 26 నిమిషాల తర్వాత శనివారం రాత్రి 10:12 గంటలకు ఢిల్లీలోని విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. నిందితుడు యూఎస్ యూనివర్సిటీలో విద్యార్థి అని, అతడు తాగిన మత్తులో నిద్రపోతున్నప్పుడు మూత్ర విసర్జన చేశాడు. అయితే ఈ విషయంపై విద్యార్థి, ప్రయాణికుడికి క్షమాపణలు చెప్పాడు. ఈ ఘటనకు సంబంధించి పైలెట్, ఢిల్లీ విమానాశ్రయంలోని ఏటీసీకి సమాచారం ఇచ్చాడు. సీఐఎస్ఎఫ్ సిబ్బంది నిందితుడిని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు.
గతేడాది నవంబర్ లో న్యూయార్క్ నుంచి న్యూఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ఇలాంటి ఘటనే జరిగింది. ఒక సీనియర్ సిటిజన్ పై మద్యం మత్తులో ఉన్న శంకర్ మిశ్రా మూత్రవిసర్జన చేశాడు. ఈ ఘటన నెల రోజుల తర్వాత వెలుగులోకి రావడంతో డీజీసీఏ చర్యలు ప్రారంభించింది. ఎయిర్ ఇండియాకు రూ. 30 లక్షల జరిమానా విధించింది. ఇక నిందితుడు శంకర్ మిశ్రాను అధికారులు అరెస్ట్ చేవారు. మిశ్రాపై నాలుగు నెలల పాటు విమానయాన నిషేధం విధించారు.