UP Assembly turns into courtroom: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ చరిత్రలోనే కీలక పరిణామం చోటు చేసుకుంది. 58 ఏళ్ల తర్వాత యూపీ అసెంబ్లీ కోర్టుగా మారింది. కోర్టుగా మారడమే కాదు ఏకంగా ఆరుగురు పోలీసులకు జైలు శిక్ష విధించింది. దాదాపుగా రెండు దశాబ్ధాల కాలం ముందు బీజేపీ ఎమ్మెల్యే సలీల్ విష్ణోయ్ ఇచ్చిన ప్రివిలేజ్ నోటీసు ఉల్లంఘనకు సంబంధించి అసెంబ్లీ విచారించింది. ఆరుగురు పోలీసులకు ఒక రోజు జైలు శిక్షను విచారించింది అసెంబ్లీ.
2004లో బీజేపీ ఎమ్మెల్యే విష్ణోయ్ తన కార్యకర్తలతో కలిసి కాన్పూర్ లో విద్యుత్ కోతలకు వ్యతిరేకంగా జిల్లా కలెక్టర్ కు ఒక మెమోరాండం సమర్పించడానికి వెళ్లే సమయంలో పోలీసులు ఆయన పట్ల అనుచితంగా ప్రవర్తించారు. ఈ కేసులో అసెంబ్లీ వ్యవహారాల మంత్రి సురేష్ ఖన్నా ఆరుగరు పోలీసులు ఒకరోజు (అర్దరాత్రి 12 గంటల వరకు) జైలులో ఉండాలని ఆదేశించారు. విచారణ సమయంలో మొత్తం ఆరుగురు పోలీసులు బోనులో నిలబడ్డారు. నిందితుల్లో ఒకరైన అప్పటి సర్కిల్ ఇన్స్పెక్టర్ అబ్దుల్ సమద్, సభకు క్షమాపణలు చెప్పారు. అయినా కూడా శిక్ష నుంచి తప్పించుకోలేకపోయారు. వీరిని అర్దరాత్రి వరకు విధాన సభలోని ఓ గదికి పరిమితం చేసి భోజనం, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు.
Read Also: Olivia Morris: మా జెన్నీ పాపకు కూడా ఒక అవార్డు ఇస్తే.. సంతోషిస్తాం
ఈ కేసులో కాన్పూర్ నగర్ లోని బాబూ పూర్వా అప్పటి సర్కిల్ ఆఫీసర్ అబ్దుల్ సమద్, కిద్వాయ్ నగర్ ఎస్ హెచ్ ఓ శ్రీకాంత్ శుక్లా, ఎస్ఐ త్రిలోకి సింగ్, కానిస్టేబుళ్లు చోటే సింగ్, వినోద్ మిశ్రా, మెహర్బన్ సింగ్ ఉన్నారు. కోర్టు విచారణ సమయంలో సమాజ్ వాదీ పార్టీ సభ్యులెరు అసెంబ్లీలో లేరు. ప్రతిపక్ష నాయకుడు అఖిలేష్ యాదవ్ తో పాటు అంతా ఎమ్మెల్యేలు సభలో తమకు తక్కువ సమయం ఇచ్చారని వాకౌట్ చేశారు.
1964లో చివరి అసెంబ్లీ కోర్టు నిర్వహించారు. మార్చి 14,1964న అప్పటి ఎమ్మెల్యే నర్సింహ్ నారాయణ్ పాండే తనపై సభలో అవినీతికి సంబంధించిన పోస్టర్లు వేయడంపై అప్పటి యూపీ అసెంబ్లీ స్పీకర్‌కి ఫిర్యాదు చేశారు. ఈ కేసులో నలుగురు అసెంబ్లీ సభ్యులపై అధికార ఉల్లంఘన నోటీసును జారీ చేశారు. ముగ్గురు సభ్యులు అసెంబ్లీ కమిటీ ముందు హాజరు కాగా, స్పీకర్ పదే పదే విన్నవించినా కేశవ్ సింగ్ అనే వ్యక్తి హాజరుకాలేదు. అనంతరం స్పీకర్ ఆదేశాల మేరకు మార్షల్స్‌ను గోరఖ్‌పూర్‌కు పంపించి కేశవ్‌సింగ్‌ను అరెస్టు చేసి సభలో ప్రవేశపెట్టారు. ఉల్లంఘనపై సింగ్‌కు 7 రోజుల శిక్ష మరియు రూ. 2 జరిమానా కూడా విధించబడింది.