Rahul Gandhi: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘‘ఉన్నావ్ అత్యాచారం’’ కేసులో దోషిగా తేలిన మాజీ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు ఢిల్లీ హైకోర్టు ఉపశమనం ఇచ్చింది. సెంగార్ ఈ కేసులో తనపై వచ్చిన ఆరోపణల్ని, జైలు శిక్షను సవాల్ చేశాడు. హైకోర్టు సెంగార్ శిక్షను నిలిపివేస్తూ బెయిల్ మంజూరు చేసింది. ఆయన ఇప్పటికే 7 ఏళ్ల 5 నెలల జైలు శిక్ష పూర్తి చేయడంతో న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.
అయితే, ఆయనకు బెయిల్ ఇవ్వడంపై బాధితురాలు, ఆమె తల్లి ఢిల్లీలో ఆందోళనకు దిగారు. తమకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఆందోళన చేస్తున్నవారిని పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి తరలించడం వివాదస్పమైంది. ఇదిలా ఉంటే, తమకు న్యాయం చేయాలని కోరుతూ, ఉన్నావ్ అత్యాచార కేసులో బాధితురాలు,ఆమె తల్లి ఈ సాయంత్రం కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని కలిశారు. రాహుల్ గాంధీ జర్మనీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన ఒక రోజు తర్వాత, సోనియాగాంధీ నివాసమైన 10జన్‌పథ్ రోడ్‌లో బాధితురాలితో రాహుల్ గాంధీ సమావేశమయ్యారు.
పారామిలిటరీ సిబ్బంది బాధితురాలు, ఆమె తల్లిపై దురుసుగా వ్యవహరించడాన్ని రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా ఖండించారు. ‘‘ మేము ఎదుర్కొంటున్న పరిస్థితిని వారికి చెప్పాలనుకుంటున్నాము. నేను ప్రధాని, కేంద్ర హోం మంత్రిని, రాష్ట్రపతిని కలవాలనుకుంటున్నాను. నాకు న్యాయం కావాలి’’ అని రాహుల్‌గాంధీని కలలవడానికి ముందు బాధితురాలు అన్నారు. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను వారు విమర్శించారు. శిక్షను నిలిపివేసి, బెయిల్ మంజూరు చేయడం దేశంలో ఇదే తొలిసారి అని ఆమె అన్నారు. దేశంలోని ఆడపిల్లలు ఈ తీర్పు పట్ల భయపడుతున్నారని చెప్పారు.
