Site icon NTV Telugu

UK PM: భారత్ ‘‘గ్రేట్ ఎకానమి’’.. ట్రంప్ వ్యాఖ్యలకు యూకే ప్రధాని కౌంటర్..

Uk Pm

Uk Pm

UK PM: భారత ఆర్థిక వ్యవస్థ 2028 నాటికి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని యూకే ప్రధాని కీర్ స్టార్మర్ అన్నారు. భారత్ ఈ స్థాయికి చేరుకునే మార్గంలో ఉందని ఆయన అన్నారు. యూకే ప్రధాని వ్యాఖ్యలు, ట్రంప్ ‘‘డెడ్ ఎకానమీ’’ వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఉన్నాయి. భారత్ ఇటీవలే జపాన్‌ను అధిగమించి నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది.

ప్రస్తుతం, యూకే ప్రధాని భారత పర్యటనలో ఉన్నారు. హిందీలో స్వాగతంతో తన ప్రసంగాన్ని ప్రారంభించిన కీర్ స్టార్మర్, భారత్ వృద్ధి గురించి ప్రశంసలు కురిపించారు. భారత అభివృద్ధి ప్రయాణంలో యూకే భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ‘‘నమస్కార్ దోస్తాన్.. 2028 నాటికి ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రధానమంత్రి నాయకత్వంపై నేను ఆయనకు అభినందనలు తెలుపుతున్నాను. 2047 నాటికి దానిని పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే మీ లక్ష్యం” అని భారతదేశానికి తొలిసారిగా వచ్చిన యూకే ప్రధానమంత్రి అన్నారు.

Read Also: Tejashwi Yadav: ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తా.. తేజస్వి యాదవ్ సంచలన ప్రకటన

ఇటీవల, భారతదేశంపై ట్రంప్ 50 శాతం సుంకాలు విధిస్తూ.. భారత ఆర్థిక వ్యవస్థ ‘‘చనిపోయినది’’గా అభివర్ణించారు. అయితే, తాజాగా కీర్ స్టార్మర్ తన పర్యటనలో 100 మందికి పైగా సీఈఓలు, ఎంటర్‌ప్రెన్యూర్లు, యూనివర్సిటీ ఛాన్సలర్లతో కూడిన భారీ ప్రతినిధి బృందంతో భారత పర్యటనకు వచ్చారు. దీనిని గమనిస్తే, భారత్ అభివృద్ధి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల ప్రపంచ బ్యాంకు కూడా భారత్ వృద్ధి 6 శాతానికి మించి ఉంటుందని అంచనా వేసింది.

మరోవైపు, యూకే ప్రధాని ఐక్యరాజ్యసమితిలో సెక్యూరిటీ కౌన్సిల్‌లో భారత్‌కు శాశ్వత సభ్యత్వానికి మద్దతు తెలిపారు. ప్రస్తుతం..అమెరికా, చైనా, యూకే, ఫ్రాన్స్, రష్యాలు శాశ్వత సభ్య హోదాను కలిగి ఉన్నాయి. భారత్ సభ్యత్వానికి ప్రతీసారి చైనా మోకాలడ్డుతోంది. మిగతా దేశాలు భారత్‌కు మద్దతు తెలిపాయి.

Exit mobile version