Pakistan-Bangladesh: షేక్ హసీనా బంగ్లాదేశ్ వదిలిపెట్టి భారత్ పారిపోయి వచ్చిన తర్వాత పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లు స్నేహితులుగా మారాయి. 1971లో పాక్ ఆర్మీ ఊచకోతను కూడా మరిచిపోయి బంగ్లాదేశ్, పాకిస్తాన్‌కు స్నేహ హస్తాన్ని ఇస్తోంది. ఇదిలా ఉంటే, ఇప్పుడు ఈ రెండు దేశాలకు అంతర్జాతీయంగా ఘోర అవమానం ఎదురైంది. యూకే తమ దేశంలోకి వద్దని చెప్పకనే చెబుతోంది. ప్రతిష్టాత్మకమైన 9 బ్రిటిష్ యూనివర్సిటీలు పాక్, బంగ్లా విద్యార్థులకు తలుపులు మూసేశాయి. ఈ రెండు దేశాల విద్యార్థులు వీసా మోసం, విద్యార్థుల దరఖాస్తుల ముసుగులో ఆశ్రయం కోరేవారు, అక్రమవలసదారులు చొరబడుతున్నారని యూకే ఆందోళన వ్యక్తం చేసింది.
ఇప్పుడు, యూకే నిర్ణయం పాక్, బంగ్లాలకు ‘‘అంతర్జాతీయ అవమానం’’గా మారింది. వీసా మోసాలు, నకిలీ డాక్యమెంట్స్, స్టూడెంట్ వీసాల పేరుతో యూకేకు వచ్చి ఆశ్రయాన్ని కోరుతున్న ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో బ్రిటన్ ఇమ్మిగ్రేషన్ అధికారులు అణిచివేత మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే చెస్టర్, వోల్వర్‌హాంప్టన్, తూర్పు లండన్, సన్డర్‌ల్యాండ్, కోవెంట్రీ వంటి విశ్వవిద్యాలయాలు 2026 ఆగస్టు చివరి వారం నుంచి డిసెంబర్ వరకు అడ్మిషన్లు నిలిపేశాయి.
యూకే నిబంధనల ప్రకారం, వీసా తిరస్కరణ రేటు 5 శాతం కన్నా తక్కువగానే ఉండాలి, కానీ పాకిస్తాన్ కు 18 శాతం, బంగ్లాదేశ్‌కు 22 శాతం తిరస్కరణలు ఉన్నాయి. లండన్ మెట్రొపాలిటన్ యూనివర్సిటీ బంగ్లాదేశ్ యూనివర్సిటీ 60 శాతం మందిని తిరస్కరించింది. యూకేకు చదువు కోసం కాకుండా, మైగ్రేషన్ కోసం వస్తున్నట్లు అక్కడి అధికారులు అనుమానిస్తున్నారు. అయితే, ఇది నిజంగా చదువుకోవాలని వస్తున్న విద్యార్థులకు నష్టం కలిగిస్తుందని పలువురు చెబుతున్నారు. బ్రిటన్ యూనివర్సిటీలు, పాకిస్తాన్ రిక్రూట్మెంట్ ఏజెన్సీలు లాభాల కోసం తప్పుదోవ పట్టించే అప్లికేషన్లను ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం యూకే నిర్ణయంతో బంగ్లాదేశ్, పాక్ విద్యార్థులు యూకేలో చదువుకోవాలనే కోరిక దాదాపుగా మూసుకుపోయినట్లే.