NTV Telugu Site icon

Maharashtra Political Crisis: మహా ప్రభుత్వం ఉంటుందా.. ఊడుతుందా..? నేడు సుప్రీం కీలక తీర్పు..

Shiv Sena

Shiv Sena

Maharashtra Political Crisis: మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండే శివసేన, బీజేపీ ప్రభుత్వానికి విషమ పరీక్ష ఎదురుకాబోతోంది. పార్టీ ఫిరాయించిన శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఉద్దవ్ ఠాక్రే వర్గం వేసిన పిటిషన్‌పై నేడు అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వబోతోంది. గతేడాది శివసేన తిరుగుబాటుపై ఉద్దవ్ ఠాక్రే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2022 జూన్ నెలలో అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేసినందుకు ఏక్ నాథ్ షిండేతో పాటు 15 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. దీనిపై సుప్రీంకోర్టు నేడు తీర్పు వెల్లడించనుంది.

గతేడాది శివసేనలో చీలిక తీసుకువచ్చి మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు, బీజేపీ సహకారంతో ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఏక్ నాథ్ షిండే సీఎంగా, దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఒక వేళ షిండేతో పాటు 15 మంది ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు అనర్హత ప్రకటిస్తే అతను రాజీనామా చేయడంతో పాటు ప్రభుత్వం రద్దు చేయబడుతుంది.

Read Also: karnataka Exit Poll: కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీ. ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నది ఇదే..

ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ చేసింది. ఉద్దవ్ ఠాక్రే వర్గానికి మద్దతుగా కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వీ వాదించగా, ఏక్నాథ్ షిండే శిబిరం తరఫున హరీష్ సాల్వే, నీరజ్ కౌల్, మహేశ్ జెఠ్మలానీలు వాదించారు. సుప్రీంకోర్టు తీర్పుకు ఒక రోజు ముందు మహారాష్ట్ర రాజకీయాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవాన్‌కులే 288 మంది సభ్యుల అసెంబ్లీలో అధికార శివసేన-బీజేపీ కూటమికి 184 ప్లస్ ఓట్లు ఉన్నాయని, అవసరమైతే తమ మెజారిటీని నిరూపించుకుంటామని అన్నారు.

మరోవైపు ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన ఎంపీ అరవింద్ సావంత్ మాట్లాడుతూ.. ఇది రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడే పోరాటం అని, చట్టం మన వెంటే ఉంటుందని అన్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే శివసేన పార్టీని, పార్టీ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం ఏక్ నాథ్ షిండే వర్గానికి కేటాయించింది. ప్రస్తుతం ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి శివసేన ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే అనే పేరు, మండుతున్న కాగడాను గుర్తుగా ఇవ్వబడింది.