Uddhav Thackeray: రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష విధించడంతో ప్రస్తుతం పరువునష్టం కేసు జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. 2019 ఎన్నికల ముందు కర్ణాటక కోలార్ లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘‘ దొంగలందరికి మోదీ అనే ఇంటిపేరే ఎందుకు ఉంటుంది’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ క్రిమినల్ పరువు నష్టం కేసు వేయగా..ఈ కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష పడటమే కాకుండా.. ఎంపీగా అనర్హత వేటు పడింది.
ఇదిలా ఉంటే పరువు నష్టం కేసులో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్కే, ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రే, ఎంపీ సంజయ్ రౌత్ లకు ఢిల్లీ హైకోర్టు ఈ రోజు సమన్లు జారీ చేసింది. సీఎం ఏక్‌నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన ఎంపీ రాహుల్ రమేష్ షెవాలే దాకలు చేసిన పిటిషన్ పై కోర్టు సమన్లు జారీ చేసింది. మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే, అతడి వర్గం శివసేన గుర్తు అయిన ‘ విల్లు-బాణం’ను రూ.2,000 కోట్లకు కొనుగోలు చేశారని ఉద్ధవ్ వర్గం నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఠాక్రే వర్గం నేతలను అడ్డుకోవాలని షెవాలే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇది రాజకీయ సమస్య కాబట్టి ఎదుటి పక్షం వాదనలను వినకుండా ఉత్తర్వులు ఇవ్వలేమని కోర్టు పేర్కొంది.
Read Also: Drugs Price : ఫార్మా కంపెనీల ‘మందు’పాతర.. ఏప్రిల్ 1న విడుదల
విచారణ సమయంలో రాహుల్ రమేష్ షెవాలే తరపు న్యాయవాది మాట్లాడుతూ సంజయ్ రౌత్ తదితరులు భారత ఎన్నికల సంఘం వంటి సంస్థపై ఆరోపణ చేశారని అన్నారు. ఇలాంటి ఆరోపణలపై స్పందించే అవకాశం ఈసీఐకి ఉందని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం శివసేన గుర్తు ‘విల్లు-బాణం’ని ఏక్ నాథ్ షిండే వర్గానికి అప్పగించింది.
గత మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన-బీజేపీ కూటమి పోటీ చేసింది. ఈ కూటమికి మ్యాజిక్ ఫిగర్ కు అవసరం అయిన స్థానాలు వచ్చాయి. అయితే తమకే సీఎం పదవి కావాలని శివసేన డిమాండ్ చేసింది. చివరకు బీజేపీని వదిలి ప్రత్యర్థులు అయిన ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలో మహావికాస్ అఘాడీ పేరుతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనిపై గతేడాది శివసేనలోని ఎమ్మెల్యేలు ఏక్ నాథ్ షిండే నేతృత్వంలో తిరుగుబాటు చేశారు. 40కి పైగా ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు తెలపడంతో ఏక్ నాథ్ సీఎంగా, దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
