దీపావళి పండుగ వేళ తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యవహార శైలి రాజకీయ దుమారం రేపుతోంది. దీపావళి పండుగను పురస్కరించుకుని ఆ విశ్వాసం ఉన్నవారికి మాత్రమే దీపావళి శుభాకాంక్షలు అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ఒక కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. ‘‘నేను వేదికపైకి వస్తున్నప్పుడు చాలామంది నాకు పుష్పగుచ్ఛాలు, పుస్తకాలు ఇచ్చారు. మరి కొందరు నాకు ఏమి చెప్పాలో తెలియలేదు. కొందరు దీపావళికి శుభాకాంక్షలు చెప్పాలా వద్దా అని సంకోచించారు. నేను ఏమనుకుంటానో అని వెనక్కి తగ్గారు. అయితే ఆ విశ్వాసం ఉన్నవారికి నేను దీపావళి శుభాకాంక్షలు చెబుతున్నాను.’’ అని వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: UP: మేనల్లుడితో పారిపోయిన ఇద్దరు పిల్లల తల్లి.. 6 నెలల తర్వాత ఏమైందంటే..!
ప్రస్తుతం ఈ వ్యాఖ్యలే రాజకీయ దుమారం రేపుతున్నాయి. డీఎంకే హిందువులపై వివక్ష చూపుతోందని బీజేపీ ధ్వజమెత్తింది. తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నాయకురాలు తమిళిసై మండిపడ్డారు. ‘‘వారు అంగీకరించినా.. అంగీకరించకపోయినా వారు ప్రాథమికంగా హిందువులు. నమ్మేవారిని మాత్రమే మేము కోరుకోము. ఉదయనిధి వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.’’ అని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌లకు తమిళిసై దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘మీరు ఇతర మతాల వారిని పలకరించేటప్పుడు అది నమ్మేవారి కోసమే అని మీరు అనరు. కానీ హిందూ మతం విషయానికి వస్తే మాత్రం అది నమ్మేవారి కోసమే అని మీరు అంటున్నారు’’. అని మండిపడ్డారు.
ఇది కూడా చదవండి: Gold Rates: దీపావళి రోజున గోల్డ్ లవర్స్‌కు స్వల్ప ఊరట.. నేడు ధరలు ఇలా..!
ఇక తమిళనాడు బీజేపీ అధికార ప్రతినిధి ఎఎన్ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ.. పండుగల సమయంలో హిందువులను పలకరించడానికి డీఎంకే ప్రభుత్వానికి ప్రాథమిక దయ కూడా లేదా అని ధ్వజమెత్తారు. ‘‘డీఎంకే హిందూ వ్యతిరేక పార్టీ అనేది అందరికీ తెలిసిన విషయమే. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పౌరుడిని సమానత్వంతో చూసుకోవాల్సిన బాధ్యత వారిపై ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా జాగ్రత్తగా రూపొందించిన రాజ్యాంగం ఈ ఆవశ్యకతను స్పష్టంగా నొక్కి చెబుతుంది. అయినప్పటికీ డీఎంకే పాలనలో హిందూ పండుగలకు శుభాకాంక్షలు తెలిపే ప్రాథమిక దయ కూడా లేదా? బదులుగా హిందూ విశ్వాసానికి వ్యతిరేకంగా ప్రత్యేకంగా నిరంతరాయంగా దుమ్మెత్తిపోయడమే ఎంచుకుంది.’’ అని ఎఎన్ఎస్ ప్రసాద్ మండిపడ్డారు.
2023లో కూడా సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సనాతన ధర్మం సామాజిక న్యాయం అనే ఆలోచనకు విరుద్ధమని.. దీన్ని నిర్మూలించాలని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులతో పోల్చారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తాజాగా దీపావళి శుభాకాంక్షలు.. విశ్వసించేవారికి మాత్రమే అని వ్యాఖ్యానించారు.
వచ్చే ఏడాది ప్రారంభంలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అన్ని పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. మరోసారి అధికారం కోసం డీఎంకే.. ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని ఎన్డీఏ కూటమి భావిస్తోంది.
ఇది కూడా చదవండి: Trump-Modi: రష్యా చమురు కొనడం ఆపేయాలి.. లేదంటే భారీ సుంకాలుంటాయి.. భారత్‌కు మళ్లీ ట్రంప్ హెచ్చరిక