Pakistan Spies: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా తర్వాత ఒక్కొక్కరుగా పాకిస్తాన్ గూఢచారులు బయటపడుతున్నారు. ఇటీవల కాలంలో జ్యోతి మల్హోత్రా కేసు దేశంలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ అధికారులు, ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్లు తేలింది. ఇదిలా ఉంటే, తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో పాకిస్తాన్ తరుపున గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలతో యూపీ యాంటీ-టెర్రరిజం స్వ్కాడ్ (ఏటీఎస్) ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేసింది.
ఇందులో ఒకరికి, ఇటీవల భారత బహిష్కరించిన పాక్ హైకమిషన్ అధికారితో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. మొహమ్మద్ హరూన్, తుఫైల్ అనే ఇద్దరు వ్యక్తులు భారత అంతర్గత భద్రతకు సంబంధించిన ముఖ్యమైన సమచారాన్ని పాకిస్తాన్‌తో పంచుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. హరూన్ పాకిస్తాన్ రాయబార కార్యాలయ ఉద్యోగి మొహమ్మద్ ముజమ్మిల్ హుస్సేన్‌కు సన్నిహితుడు. న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ ఉద్యోగి ముజమ్మిల్ హుస్సేన్‌ను ప్రభుత్వం పర్సనా నాన్ గ్రాటాగా ప్రకటించింది, దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది.
Read Also: Bangladesh: మహ్మద్ యూనస్‌కి ఆర్మీ చీఫ్ వార్నింగ్.. “రఖైన్ కారిడార్”పై విభేదాలు..
ఇదే కాకుండా, పాకిస్తాన్ తరుపున గూఢచర్యం చేస్తున్న వారణాసికి చెందిన తుఫైల్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. 600 మంది పాకిస్తానీయులతో ఇతడికి సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇతను పాకిస్తాన్‌లో నివసిస్తున్న ప్రజలకు రాజ్‌ఘాట్, నమో ఘాట్, జ్ఞాన్‌వాపి, రైల్వే స్టేషన్, ఎర్రకోట చిత్రాలను పంపాడని ఆరోపణలు ఉన్నాయి. ఇతను వారణాసిలో పాకిస్తాన్ వాట్సాప్ గ్రూపుల లింకుల్ని షేర్ చేసి, ప్రజలు నేరుగా పాకిస్తాన్ వ్యక్తులతో కనెక్ట్ అయ్యేలా చేశాడు. పాక్ సైన్యంలో పనిచేస్తున్న ఒక వ్యక్తి భార్య అయిన నఫీసాతో ఇతడికి పరిచయాలు ఉన్నాయి. ఉగ్రవాద సంస్థ ‘తెహ్రీక్-ఎ-లబ్బాయిక్’ నాయకుడు మౌలానా షాద్ రిజ్వీ వీడియోలను వాట్సాప్ గ్రూపులలో పంచుకున్నట్లు కూడా అతనిపై ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా, బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతీకారం తీర్చుకోవడం, షరియా చట్టాన్ని అమలు చేయడం వంటి సందేశాలను కూడా అతను పంచుకున్నాడు.