Donald Trump: భారత ఎన్నికల్లో జోక్యం చేసుకోవడానికి అమెరికా నిధులను ఉపయోగించారని ఇటీవల డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల సమయంలో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు 21 మిలియన్ డాలర్లను యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (USAID) అందించినట్లు ఆరోపించారు. ఈ ఆరోపణలు దేశంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య అగ్గిరాజేశాయి. యూఎస్ఎయిడ్ నిధుల్ని కాంగ్రెస్, దాని ఎకోసిస్టమ్ వాడుకుందని బీజేపీ కాంగ్రెస్‌పై ఆరోపణలు గుప్పించింది.
ఇదిలా ఉంటే, మరోసారి డొనాల్డ్ ట్రంప్ భారతదేశం, అమెరికా నిధులపై వ్యాఖ్యలు చేశారు. అమెరికా వస్తువులపై భారీగా సుంకాలు విధించడం ద్వారా ఆ దేశం ఇప్పటికే ప్రయోజనం పొందుతోందని ఆరోపిస్తూ, అమెరికా భారతదేశానికి ఎందుకు సాయం అందిస్తోందని ట్రంప్ పశ్నించారు. ‘‘భారత ఎన్నికల్లో సాయం చేయడానికి 18 మిలియన్ డాలర్లు, ఎందుకీ నరకం..? మేము ఎన్నికల కోసం భారతదేశానికి డబ్బు ఇస్తున్నాము, వారికి డబ్బు అవసరం లేదు’’ అని ట్రంప్ ఈ రోజు వాషింగ్టన్‌లో జరిగిన కన్జర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్(CPAC)లో ప్రసంగిస్తూ అన్నారు.
Read Also: Yogi Adityanath: కుంభమేళాకి 62 కోట్ల మంది భక్తులు..ఈ శతాబ్ధంలోనే అరుదైన సంఘటన..
‘‘వారు మిమ్మల్ని బాగా ఉపయోగించుకుంటున్నారు. ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో అది ఒకటి. మేము ఏదో ఒకటి అమ్మడానికి ప్రయత్నిస్తాము, వారు 200 శాతం సుంకాలు విధిస్తారు. ఆపై వారికి ఎన్నికల్లో సహాయం చేయడానికి మేము వారికి డబ్బు ఇస్తున్నాము’’ అని ట్రంప్ అన్నారు.
అయితే, ఈ 21 మిలియన్ డాలర్ల అమెరికా నిధులు భారత ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడానికి కాంగ్రెస్ ఉపయోగించిందని బీజేపీ ఆరోపించింది. అయితే, ఈ నిధులు బంగ్లాదేశ్‌కి కేటాయించినట్లు చెబుతూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్, వాషింగ్టన్ పోస్ట్ కథనాలను ప్రచురించాయి. దీంతో బీజేపీపై కాంగ్రెస్ రివర్స్ అటాక్ మొదలుపెట్టింది. కాషాయ పార్టీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తోంది.