Site icon NTV Telugu

USA: రష్యా యుద్ధానికి భారత్ నిధులు సమకూరుస్తోంది..

Usa

Usa

USA: రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహాయకుడు విమర్శలు చేశారు. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు పరోక్షంగా భారత్ నిధులు సమకూరుస్తోందని ట్రంప్‌కి అత్యంత సన్నిహితంగా ఉండే స్టీఫెన్ మిల్లర్ అన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై ట్రంప్ పరిపాలన ఒత్తిడి తీవ్రతరం చేస్తున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు వచ్చాయి.

భారతదేశం రష్యా నుంచి చమురు కొనుగోలును ఆపాలని ట్రంప్ స్పష్టం చెబుతున్నట్లు ఆయన వెల్లడించారు. “రష్యా నుండి చమురు కొనుగోలు చేయడం ద్వారా భారతదేశం ఈ యుద్ధానికి నిధులు సమకూర్చడం కొనసాగించడం ఆమోదయోగ్యం కాదని ఆయన (ట్రంప్) చాలా స్పష్టంగా చెప్పారు” అని మిల్లర్ అన్నారు. రష్యాతో భారత్ చమురు వాణిజ్యాన్ని చూసి ట్రంప్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆశ్చర్యపోయినట్లు చెప్పారు. రష్యన్ చమురు కొనుగోలులో భారత్ చైనాతో ముడిపడి ఉందని తెలిస్తే ప్రజలు షాక్‌కి గురవుతారని, ఇది ఆశ్చర్యకరమైన వాస్తవం అని చెప్పారు.

Read Also: Karnataka: ముస్లిం ప్రిన్సిపాల్‌ను తొలగించాలని స్కూల్ వాటర్ ట్యాంకులో విషం..

అయితే, అమెరికా ఒత్తిడి ఉన్నప్పటికీ భారత్ తన కొనుగోళ్లను ఆపడం లేదని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. జూలై 30న, డొనాల్డ్ ట్రంప్ భారతీయ వస్తువులపై 25 శాతం సుంకాన్ని ప్రకటించారు. భారత్ రష్యన్ ఆయుధాలు, చమురు కొనుగోలుపై ట్రంప్ హెచ్చరించారు. రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు ‘‘చనిపోయిన ఆర్థిక వ్యవస్థలు’’గా అభివర్ణించాడు. ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందానికి రష్యా అంగీకరించకపోతే రష్యా నుండి చమురు కొనుగోలును కొనసాగించే ఏ దేశం నుండి దిగుమతులపైనా 100% వరకు అధిక సుంకాలను విధించడాన్ని పరిశీలిస్తానని ట్రంప్ చెప్పారు. భారత్, అమెరికా సంబంధాల్లో రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడాన్ని చికాకు పరిచే అంశంగా అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో అన్నారు. భారత్‌ని వ్యూహాత్మక భాగస్వామిగా పిలిచారు. రాయిటర్స్ ప్రకారం, 2021లో ఉక్రెయిన్ యుద్ధానికి ముందు, భారతదేశ చమురులో 3% మాత్రమే రష్యా నుండి వచ్చాయి. ఆ సంఖ్య ఇప్పుడు దాని మొత్తం చమురు దిగుమతుల్లో 35% మరియు 40% మధ్య పెరిగింది.

Exit mobile version