రాష్ట్ర విభజనపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల విభజన అందరి అభిప్రాయాల మేరకు జరగలేదంటూ పార్లమెంట్‌లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు గుర్రుమంటున్నారు. ఈ నేపథ్యంలో మోదీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులను ఇచ్చారు. ఈ మేరకు రాజ్యసభ ఛైర్మన్ కార్యాలయంలో రూల్ 187 కింద సభా హక్కుల ఉల్లంఘన నోటీసులను టీఆర్ఎస్ ఎంపీలు అందజేశారు. తెలంగాణ బిల్లుపై ప్రధాని అభ్యంతరకరంగా మాట్లాడారని అందులో పేర్కొన్నారు. తలుపులు మూసేసి తెలంగాణ బిల్లును ఆమోదింపజేశారని మాట్లాడటం రాజ్యాంగాన్ని అవమానించడమేనని తెలిపారు.
ఈ మేరకు ప్రివిలేజ్ మోషన్ నోటీసులను రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు టీఆర్‌ఎస్ ఎంపీలు అందించారు. ఎంపీలు కేశవరావు, సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్ నోటీసులు అందించిన వారిలో ఉన్నారు. అనంతరం రాజ్యసభ సమావేశాలను టీఆర్ఎస్ ఎంపీలు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఫిబ్రవరి 8న రాజ్యసభలో తెలంగాణ ఏర్పాటును కించపరిచేలా మోదీ వ్యాఖ్యలు ఉన్నాయని టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు తెలిపారు. పార్లమెంట్ కార్యకలాపాలను, చట్ట సభను దిగజార్చేలా.. పార్లమెంట్ ప్రిసైడింగ్ అధికారులను అగౌరవ పరిచేలా ప్రధాని మోదీ వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపించారు.