Toyota Kirloskar vice-chairman Vikram Kirloskar dies of cardiac arrest at 64: ప్రముఖ పారిశ్రామికవేత్త, టయోటా కిర్లోస్కర్ మోటార్ వైస్ చైర్మన్ విక్రమ్ ఎస్ కిర్లోస్కర్ (64) హఠాన్మరణం పొందారు. మంగళవారం అర్థరాత్రి గుండెపోటు రావడంతో ఆయన మృతి చెందారు. ఈ విషయాన్ని కిర్లోస్కర్ ఒక ప్రకటన ద్వారా తెలియజేసింది. చివరిసారిగా ఈయన నవంబర్ 25వ తేదీన ముంబైలో జరిగిన టయోటా ఇన్నోవా హైక్రాస్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. విక్రమ్ హఠాన్మరణంతో బిజినెస్ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించాయి.
కాగా.. అమెరికాలోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో విక్రమ్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. భారత ఆటోమొబైల్ పరిశ్రమ ఈరోజు ఈ స్థాయిలో ఉండటానికి కృషి చేసిన వారిలో విక్రమ్ ఒకరు. జపాన్‌కు చెందిన టయోటా మోటార్ కార్ప్‌ను భారత్‌కు తీసుకురావడంలో విక్రమ్ ముఖ్యపాత్ర పోషించారు. టయోటా, కిర్లోస్కర్ భాగస్వామ్యంతో టయోటా కిర్లోస్కర్ మోటార్ కంపెనీ ఏర్పడింది. 1888లో ప్రారంభమైన కిర్లోస్కర్ పారిశ్రామిక గ్రూపు నుంచి విక్రమ్ నాలుగో తరం వ్యక్తి. ఈయన కిర్లోస్కర్ సిస్టమ్స్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, టయోటా కిర్లోస్కర్ మోటార్ వైస్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.
కర్ణాటకలోని బెంగళూరు నివాసి అయిన విక్రమ్.. ఆ రాష్ట్రంలో ఒక పెద్ద ఆటోమొబైల్ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయడంలో దోహదం చేశారు. ఆయన చేసిన ఈ సేవలను గుర్తించి.. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు ‘సువర్ణ కర్ణాటక’ అనే అవార్డును అందించింది. విక్రమ్‌కు భార్య గీతాంజలి, కుమార్తె మానసి ఉన్నారు. విక్రమ్ కిర్లోస్కర్ మరణం పట్ల కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై, బయోకాన్ చైర్ పర్సన్ కిరణ్ మజుందార్ షాతో పాటు పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.