NTV Telugu Site icon

Delhi Elections: 2015, 2020లో బీజేపీ గ్రాఫ్ ఇది.. 2025 బిగ్ ఛేంజ్ అవుతుందా?

Bjp

Bjp

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. మరికొన్ని గంటల్లో ఫలితాలు వెలువడనున్నాయి. దేశ వ్యాప్తంగా ఢిల్లీ ఫలితాలపై ఆసక్తి నెలకొంది. ఈసారి ఏ పార్టీ గెలుస్తుందోనన్న ఉత్కంఠ రేపుతోంది. ఎగ్జిట్ పోల్స్ మాత్రం బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి. ఆప్ మాత్రం అవి ఫేక్ సర్వేలంటూ తోసిపుచ్చుతోంది. ఇలా ఎవరికి వారే తమ వాదనలు వినిపిస్తున్నారు. ఈ ఊహాగానాలన్నింటికీ మరికొన్ని గంటల్లో తెరపడనుంది.

ఇదిలా ఉంటే 2015, 2020 ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గానీ.. బీజేపీ గానీ ఏ మాత్రం ప్రభావం చూపించలేదు. కాంగ్రెస్ అయితే జీరో సీట్లు సాధించింది. బీజేపీ అయితే కనీసం కొన్ని సీట్లైనా గెలిచింది. 2015లో వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 70 సీట్లలో 62 గెలుచుకుని ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పుడు బీజేపీ 8 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ కనీసం ఖాతా తెరవలేదు. ఇక 2020 అసెంబ్లీ ఎన్నికల్లో 67 సీట్లు గెలుచుకుని తిరిగి ఆమ్ ఆద్మీ పార్టీ సర్కార్ ఏర్పాటు చేసింది. బీజేపీ కేవలం 3 సీట్లతో సరిపెట్టింది. అప్పుడు కూడా కాంగ్రెస్ ఒక్క సీటు గెలవలేదు.

అయితే ఈసారి జరిగిన ఎన్నికలు అందుకు భిన్నమని బీజేపీ వాదిస్తోంది. కచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కమలం పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. దీనికి ఎగ్జిట్ పోల్స్ సర్వేలు కూడా కమలానికే జై కొట్టాయి. కనీసం 55 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పాయి. రెండో స్థానంలో ఆప్ ఉండబోతుందని పేర్కొన్నాయి. దీనికి ప్రధాన కారణం.. ఢిల్లీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పాయి. అంతేకాకుండా ఆప్ ప్రకటించినట్లుగానే.. బీజేపీ కూడా ఉచిత హామీలు ప్రకటించింది. దీంతో ఓటర్లంతా కమలం వైపు చూసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లుగా శనివారం బీజేపీ గెలుస్తుందా? లేదంటే ఆప్ గెలుస్తుందా? అన్నది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.