ఇటీవల కాలంలో స్కూల్స్ లో ఉపాధ్యాయుల తీరు ఆందోళనకరంగా మారుతోంది. విద్యార్థుల పట్ల వారు ప్రవర్తించే తీరు తల్లిదండ్రులకు భయాందోళనలకు గురిచేస్తుంది. విద్యార్థి తప్పు చేస్తే మందలించడం అనేది సాధారణం.. కానీ వారిని ఇష్టం వచ్చినట్లు చితకబాదడం అనేది తప్పు.. విద్యార్థులు చదవలేదనో, స్కూల్ కు రాలేదనో…ఇతరత్రా కారణాల వల్ల…వారిపై దాడులకు దిగుతున్నారు. విద్యార్థులను సరైన మార్గంలో పెట్టాలని విచిత్రమైన శిక్షలను విధిస్తూ ఉపాధ్యాయులు జైలు పాలవుతున్నారు. తాజాగా ఒక విద్యార్థిని భయపెట్టడానికి హెడ్ మాస్టర్ చేసిన నిర్వాకం ప్రస్తుతం సంచలనంగా మారింది.
వివరాలలోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ మీర్జాపూర్ ప్రాంతంలోని ఒక స్కూల్ లో సోను యాదవ్ రెండో తరగతి చదువుతున్నాడు.. సోను చాలా అల్లరివాడు.. స్కూల్ లో ఎప్పుడూ అల్లరిచేస్తూ తిరిగేవాడు. ఈ నేపథ్యంలోనే గురువారం సోను తరగతి గదిలో తన స్నేహితులతో గొడవపడి వారిని కొరికాడు. దీంతో టీచర్ సోనుపై హెడ్ మాస్టర్ కి ఫిర్యాదు చేసింది. ఇక ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన హెడ్ మాస్టర్ మనోజ్ విశ్వకర్మ తరగతి గది నుంచి సోను కాలు పట్టుకుని లాక్కొచ్చాడు. చేసిన తప్పుకు క్షమాపణ కోరమని.. లేదంటే సోనుని బిల్డింగ్ పై నుంచి కిందకు పడేస్తానని బెదిరించాడు. అన్నట్లుగానే బిల్డింగ్ పైకి తీసుకెళ్లి కిందకు వేలాడేశాడు. ఈ ఘటనతో పిల్లాడు గుక్క పెట్టి ఏడవడం మొదలుపెట్టాడు. దీంతో మిగతా ఉపాధ్యాయులు, విద్యార్థులు వచ్చి సోనును విడిపించారు. ఇక ఈ విషయం ఇంటికెళ్లి తండ్రికి చెప్పడంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేసి హెడ్ మాస్టర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇక ఈ ఘటనపై మనోజ్ స్పందిస్తూ.. సోను చాలా అల్లరి పిల్లవాడు.. స్కూల్ లో పిల్లలనే కాదు , టీచర్లను కూడా కోరుకుంతాడు.. పిల్లాడి తండ్రే తన వద్దకు వచ్చి పిల్లాడిని క్రమశిక్షణలో పెట్టాలని అడిగాడు. కాస్త భయపెడదామని ఆ పని చేశాను అంతే అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయినా పిల్లాడిని భయపెట్టమన్నారు కానీ చంపేయమనలేదు అని కొందరు.. పిల్లాడు ఆ భయంతో చనిపోయి ఉంటే ఎవరిది బాధ్యత అని మరికొందరు హెడ్ మాస్టర్ ని ఏకిపారేస్తున్నారు.