NTV Telugu Site icon

INDIA Bloc: ఇండియా కూటమి కీలక నిర్ణయం.. ఉభయ సభల్లో రగడ తప్పదా?

Indiabloc

Indiabloc

పార్లమెంట్‌లో సంకీర్ణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై దేశ వ్యాప్తంగా విపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి. ఇక ఇండియా కూటమి నేతలు ఆరోపణలు గుప్పించారు. ఇదిలా ఉంటే మంగళవారం సాయంత్రం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసంలో కూటమి నేతలు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా నిర్మలమ్మ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై చర్చించారు.

బడ్జెట్‌ వ్యతిరేకంగా నిరసన తెలిపాలని కూటమి నేతలు నిర్ణయించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ ఎంపీ ప్రమోద్‌ తివారీ వెల్లడించారు. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం చేస్తోందన్నారు. మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు మాత్రమే భారీ ప్రాజెక్టులను ప్రకటించారని తెలిపారు. దీనిపై బుధవారం పార్లమెంట్‌లో నిరసన తెలిపాలని కూటమి నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు. న్యాయం కోసం ఉభయ సభల్లో పోరాడతామని ఆయన పేర్కొన్నారు.

ఈ సమావేశానికి కాంగ్రెస్‌ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, శరద్‌ పవార్‌, సంజయ్‌ రౌత్‌ తదితరులు హాజరయ్యారు. తమ కుర్చీని కాపాడుకునేందుకు ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ అంటూ రాహుల్‌ గాంధీ, ఖర్గే కేంద్రంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.