Delhi Congress: 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ అధిష్టానం చర్యలు ప్రారంభించింది. కర్నాటక శాసనసభ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించిన తరువాత.. వివిధ రాష్ట్రాల్లో ఉన్న పార్టీ పరిస్థితిని సమీక్షించి పార్టీ పటిష్టతకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. అందులో భాగంగా దేశంలోని అన్ని పీసీసీలతో ఎన్నికల సన్నాహక సమావేశాలను నిర్వహించడానికి రెడీ అయింది. కర్ణాటక తరహాలోనే గెలిచేలా ఆయా రాష్ట్రాలకు బూస్ట్ ఇచ్చేలా కాంగ్రెస్ హైకమాండ్ పావులు కదుపుతోంది. సమావేశాల్లో భాగంగా రాష్ర్టాల్లోని కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు జరిగేలా ఎన్నికల వ్యూహాలపై తగు నిర్ణయాలను తీసుకుంటోంది కాంగ్రెస్ అధిష్టానం. కాంగ్రెస్ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా ఇప్పటికే మధ్యప్రదేశ్ రాష్ట్ర సమావేశాన్ని కాంగ్రెస్ హైకమాండ్ నిర్వహించింది. ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలతో సమావేశం నిర్వహించనుంది. రేపు ఛత్తీస్ ఘడ్ పీసీసీపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించింది.
Read also: Traffic Rules Challan: డ్రైవింగ్ చేసేటప్పుడు ఇలా పట్టుబడితే.. 15వేల ఫైన్, రెండేళ్ల జైలు శిక్ష!
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి పెట్టాలని భావించినట్టు తెలుస్తోంది. దక్షిణాది రాష్ర్టాల్లో బీజేపీపై వ్యతిరేకత ఉండటం కాంగ్రెస్‌కు కలసివచ్చే అంశం. ఈ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాలపై ఎక్కువ దృష్టి పెట్టాలని భావిస్తోంది. అందులో భాగంగా నేడు తెలంగాణ కాంగ్రెస్ నేతలతో అధిష్టానం ఢిల్లీలో ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించనుంది. ఈ రోజు మధ్యా్హ్నం 12 గంటలకు జరిగే సమావేశం కీలకం కానుంది. ఇటు తెలంగాణ రాష్ట్రానికి.. అటు హైకమాండ్‌కు కూడా కీలకం కానుంది. సమావేశానికి రాష్ట్రానికి చెందిన 11 మంది ముఖ్యమైన నేతలకు ఆహ్వానం అందినట్టు తెలుస్తోంది.
Read also: Hyderabad: హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. రూ. 950 కోట్ల డ్రగ్స్ ధ్వంసం..
ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ కాంగ్రెస్ నేతల కీలక సమావేశం జరగనుంది. సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షులు ఖర్గే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ తో పాటు నలుగురు ఇంచార్జ్ లతో కలిపి సమావేశానికి మొత్తం 15 మంది హాజరౌతున్నారు. తెలంగాణ ఇంచార్జి, పార్టీ జనరల్ సెక్రటరీ మాణిక్ రావు థాక్రేతోపాటు ముగ్గురు ఇంచార్జ్ సెక్రటరీలు.. రోహిత్ చౌధురి, పి.సి. విష్ణునాధ్, మన్సూర్ ఖాన్ కూడా సమావేశంలో పాల్గొంటున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రం నుంచి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తో సహా 11 మంది రాష్ట్ర ముఖ్య నేతలు పార్టీ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. నవంబర్, డిసెంబర్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం అవుతున్న రాష్ట్ర కాంగ్రెస్ ఎన్నికల్లో విజయం సాధించడం కోసం పలు నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. సమావేశంలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సిఎల్.పి నాయకుడు భట్టి విక్రమార్క సీనియర్ నాయకులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, మధు యాష్కి గౌడ్, పోడెం వీరయ్య, సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జీవన్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహ పాల్గొననున్నారు. అవసరాన్ని బట్టి అందుబాటులో ఉన్న జానారెడ్డి లాంటి నేతలను కూడా సమావేశానికి ఆహ్వానించే అంశంపై మరికొద్ది సేపటిలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.