Parboiled Rice: కేంద్ర ప్రభుత్వం బియ్యం ధరలు పెరగకుండా తగిన చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా ఇప్పటికే బాసుమతేతర బియ్యం ఎగుమతిపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. బాసుమతేతర బియ్యం ఎగుమతులపై నిషేధం విధించినప్పటికీ దేశంలో బియ్యం ధరలు నియంత్రణలో లేవు. ఇప్పటికే కిలో రూ. 70 నుంచి రూ. 120 వరకు పలుకుతున్నాయి. ఎప్పుడైతే బాసుమతేర బియ్యం ఎగుమతులను ఇండియా నిషేధించిందో.. అమెరికాలో బియ్యం ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ నేపథ్యంలో కేంద్రం.. ఇప్పుడు ఉప్పుడు బియ్యంపై ఎగుమతి సుంకం విధించింది. ఉప్పుడు బియ్యంపై 20 శాతం ఎగుమతి సుంకం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్రం విధించిన ఎగుమతి సుంకం తక్షణమే అమల్లోకి వస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. దేశంలో ఉప్పుడు బియ్యం ధరలను అదుపులో ఉంచేందుకే తాము వాటి ఎగుమతులపై ఎక్స్‌పోర్ట్ డ్యూటీ విధించామని సంబంధిత నోటిఫికేషన్‌లో కేంద్రం పేర్కొంది.
Read Also: Mynampally: మీడియాతో మాట్లాడవద్దని ఆనేత ఒట్టు వేయించుకున్నాడు.. మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు
దేశంలో బియ్యం లభ్యత పెంచేందుకు గత ఏడాది నూకలు( బ్రోకెన్ రైస్) ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది. దేశంలో ఎక్కువగా వినియోగమయ్యే నాన్ బాస్మతి తెల్ల బియ్యం ధరలు పెరిగిపోవడంతో.. గత నెల వాటి ఎగుమతులను కూడా ప్రభుత్వం నిషేధించింది. ఎగుమతులపై నిషేధం విధించిన నేపథ్యంలోనే దేశంలో కొంత మేరకు బియ్యం నిల్వలు ఉన్నాయని తెలిసింది. ఎగుమతులు నిషేధించినప్పటికీ ధరల్లో తగ్గుదల అయితే లేదు. ఉల్లిగడ్డల ధరల నియంత్రణ కోసం గత వారం ఉల్లి ఎగుమతులపై 40 శాతం ఎగుమతి సుంకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. కొద్ది రోజుల క్రితం వరకు కిలో టమాట రూ. 200 వరకు అమ్మిన దాఖలాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టమాటాలను తక్కువ ధరలకు అమ్మేలా కేంద్రం చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.