ఉగ్రవాదుల తూటకు ఓ టీవీ నటి బలైంది. జమ్మూకాశ్మీర్‌లో బుధవారం రాత్రి మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బూద్గామ్ జిల్లాలో సామాన్య పౌరుల ఇళ్లను టార్గెట్ చేసి ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఓ ఇంట్లో ఉన్న టీవీ నటి అమ్రీన్ భట్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో అమ్రీన్ భట్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే పరిస్థితి విషమించడంతో అమ్రీన్ భట్ మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనలో ఆమె పదేళ్ల మేనల్లుడు ఫర్హాన్ జుబీర్‌కు కూడా బుల్లెట్ గాయమైనట్టు పోలీసులు పేర్కొన్నారు.
బాలుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులే ఈ దాడులు జరిపినట్టు పోలీసులు తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, బలగాలు ఆ ప్రాంతంలో గాలింపు చర్చలు చేపట్టినట్టు వెల్లడించారు. మరోవైపు.. 24గంటల వ్యవధిలోనే కశ్మీర్‌లో మరో ఉగ్రదాడి చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం శ్రీనగర్‌లో జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ పోలీస్ కానిస్టేబుల్ మృతి చెందిన విషయం తెలిసిందే.
