Terrorist captured along LoC: జమ్మూ కాశ్మీర్ లో పాకిస్థాన్ ఉగ్రవాది పట్టుబడ్డాడు. సరిహద్దులు దాటి భారత సైన్యంపై దాడి చేసేందుకు వచ్చినట్లు తెలుస్తోంది. కాశ్మీర్ రాజౌరీ జిల్లాలో గత రెండు మూడు రోజులుగా చొరబాటుదారుల కదలికలు ఎక్కువయ్యాయి. ఆగస్టు 21న నౌషేరాలోని ఝంగర్ సెక్టార్ లో నియంత్రణ రేఖకు సమీపంలో ఉగ్రవాదులను కదలికను సైన్యం గుర్తించింది. కంచెను కత్తెరించి భారత్ లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. అయితే సైనికులు కాల్పుల జరపడంతో ఒకరు గాయపడ్డారు. అతన్ని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. మరో ఇద్దరు సరిహద్దుల్లో అడవుల గుండా పాకిస్తాన్ లోకి పారిపోయారు.
ప్రస్తుతం గాయపడిన ఉగ్రవాదికి చికిత్స అందిస్తున్నారు. పట్టుబడిన ఉగ్రవాది పాకిస్తాన్ లోని పీఓకే లోని కోట్లీ జిల్లా సబ్ కోట్ గ్రామానికి చెందిన తబారక్ హుస్సెన్ గా గుర్తించారు. ఇండియన్ ఆర్మీ పోస్టులపై దాడుల చేసేందుకు వచ్చామని వెల్లడించాడు. కల్నల్ యూనస్ చౌదరి అనే పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి చెందిన కల్నల్ తనను పంపాడని.. తనకు రూ. 30,000 పాకిస్తానీ కరెన్సీ ఇచ్చి, ఇండియన్ ఆర్మీపై దాడుడు చేయాలని చెప్పాడని ఒప్పుకున్నాడు. గతంలో ఇలాగే 2016లో ఇదే సెక్టార్ లో అతని సోదరుడు హరూన్ అలీతో కలిసి తబారక్ హుస్సెన్ సరిహద్దు దాటిన సమయంలో మానవత కారణాలతో పాకిస్తాన్ తిప్పి పంపారు. ఆ తరువాత 2017లో మరోసారి ఇలాగే పట్టుబడితే మళ్లీ పాకిస్తాన్ పంపించారు.
Read Also: Zomato: జొమాటోకు షాక్.. ఆర్డర్ క్యాన్సిల్ చేసిన పాపానికి..
ఇదిలా ఉంటే ఆగస్టు 22-23న నౌషేరా జిల్లాలోని లామ్ సెక్టార్ లో ఇద్దరు, ముగ్గురు టెర్రరిస్టులు సరిహద్దులు దాటేందుకు ప్రయత్నించారు. భారత సైన్యం వీరి కదలికలను గుర్తించింది. అయితే సరిహద్దు సమీపంలో ఉన్న ల్యాండ్ మైన్స్ పేలడంతో ఇద్దరు టెర్రరిస్టులు మరణించగా.. మరో ఉగ్రవాది గాయపడ్డాడని తెలుస్తోంది. గాయపడిన ఉగ్రవాది సమీపంలో ఎక్కడైనా దాక్కుని ఉండవచ్చని సైన్యం వెల్లడించింది. 48 గంటల్లోనే భారత్ ఆర్మీ లక్ష్యంగా చొరబాట్లు జరిగాయి. పాకిస్తాన్ ఆర్మీ సహకారంతోనే ఈ చొరబాట్లు జరుగుతున్నాయని పట్టుబడిన ఉగ్రవాది వెల్లడించాడు.