NTV Telugu Site icon

India-Bangladesh: భారత్- బంగ్లా సరిహద్దుల్లో కంచె నిర్మాణంపై ఉద్రిక్తత..

India Bangladesh

India Bangladesh

India-Bangladesh: షేక్ హసీనా ప్రధాని పదవి నుంచి దిగిపోయిన తర్వాత బంగ్లా తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహ్మద్ యూనస్ బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య సంబంధాలు దిగజారుతున్నాయి. ఆ దేశంలో భారత వ్యతిరేకత విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా జమాతే ఇస్లామీ, అన్సరుల్ బంగ్లా వంటి మతోన్మాద సంస్థలు భారత్‌పై విషాన్ని వెళ్లగక్కుతున్నాయి.

Read Also: KTR : నామీద కేసు పెట్టి శునకానందం పొందుతున్నారు

ఇదిలా ఉంటే, ఇప్పుడు భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలోని సుక్‌దేవ్‌పూర్ ప్రాంతంలో సరిహద్దు వెంబడి ముళ్ల కంచె నిర్మాణాన్ని బోర్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్(BGB) అడ్డుకునేందుకు ప్రయత్నించింది. దీంతో మన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(BSF), బీజీబీకి మధ్య మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. ప్రస్తుతం కంచె నిర్మాణం ప్రణాళిక ప్రకారం కొనసాగుతోందని బీఎస్ఎఫ్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వ రోడ్ వర్క్స్ డిపార్ట్‌మెంట్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) సహకారంతో కంచె ప్రాజెక్ట్‌ను చేపడుతున్నప్పుడు బంగ్లా సరిహద్దు దళం జోక్యం చేసుకుంది.

మాల్డాలోని కలియాచక్ నంబర్ 3 బ్లాక్ సరిహద్దుపై BGB అపార్థం చేసుకుందని, వారు కంచె గురించి ఆందోళన వ్యక్తం చేసిందని, వారి అభ్యంతరాలకు ప్రతిస్పందించామని, ఇప్పుడు పని సాధారణంగా జరుగుతోందని బీఎస్ఎఫ్ చెప్పింది. ఈ ఉద్రిక్త సమయంలో బంగ్లాదేశ్ సరిహద్దు సమీపంలోని ప్రజలు గుమిగూడారు. మంగళవారం ఉదయం BSF ,BGB అధికారులు మరోసారి సమావేశమయ్యారు. ప్రస్తుతం సమస్య పరిష్కరించబడింది.

Show comments