Gujarat: భార్యల వేధింపులకు భర్తలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. బెంగళూర్ టెక్కీ అతుల్ సుభాష్, ఢిల్లీ కేఫ్ ఓనర్ పునీత్ ఖురానా ఘటనలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. భార్యలు వేధించడంతో తాము ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు వీరిద్దరు వీడియో రికార్డ్ చేసి మరణించారు. తాజాగా గుజరాత్‌లో ఇలాంటి ఘటన మరొకటి జరిగింది. భార్య వేధింపులకు పాల్పడుతోందని ఆరోపిస్తూ ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Read Also: Bird flu: “బర్డ్ ఫ్లూ”తో 3 పులులు, ఒక చిరుత మృతి.. మహారాష్ట్రలో రెడ్ అలర్ట్..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డిసెంబర్ 30న గుజరాత్ బొటాడ్ జిల్లా జమ్రాలా గ్రామంలో సురేష్ సతాదియా(39) తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన మరణానికి ముందు మొబైల్ ఫోన్‌లో వీడియో రికార్డ్ చేశాడు. అందులో తన మరణానికి కారణమైన భార్యకు గుణపాఠం చెప్పాలని కోరినట్లు పోలీసులు తెలిపారు.
సతాదియా తండ్రి ఫిర్యాదు మేరకు బాధితుడి భార్య జయబెన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తన కొడుకుని కోడులు తరుచూ వేధించేదని, తరుచూ పుట్టింటికి వెళ్లేదని బాధితుడి తండ్రి ఆరోపించాడు. చాలా సందర్భాల్లో సతాదియా తన అత్తమామల ఇంటికి వెళ్లి భార్యని తీసుకురావడానికి ప్రయత్నించినా, ఆమె నిరాకరించేదని తెలిసింది. ఈ కేసులో భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 108 (ఆత్మహత్యకు ప్రేరేపణ) కింద మహిళపై కేసు నమోదు చేశామని, తదుపరి విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు.