కరోనా మళ్లీ పంజా విసరడంతో.. అన్ని రాష్ట్రాలు ఆంక్షల బాటపట్టాయి.. కానీ, కొన్ని వర్గాల నుంచి వస్తున్న డిమాండ్లను అనుగుణంగా మళ్లీ ఆంక్షలను సడలిస్తున్నాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు.. కరోనా వైరస్ కేసుల కారణంగా మూసివేసిన తమిళనాడులోని స్కూళ్లు, కాలేజీలు ఫిబ్రవరి 1వ తేదీన తిరిగి తెరుచుకుంటాయని రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ప్రకటించింది. ఇక అంతేకాదు.. ఇప్పటికే అమల్లో ఉన్న నైట్ కర్ఫ్యూ.. రేపటి నుంచి ఎత్తివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.. అలాగే, ఈ ఆదివారం (జనవరి 30) పూర్తిగా లాక్‌డౌన్ ఉండదని, దానిని ఉపసంహరించుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు..
కోవిడ్ ఉధృతి కారణఃగా మూతపడిన పాఠశాలలను ఫిబ్రవరి ఒకటో తేది నుంచి పునర్‌ప్రారంభం కానున్నాయి.. అయితే, ఎల్‌కేజీ, యూకేజీ, ప్లేస్కూళ్లను తెరిచేందుకు మాత్రం అనుమతి ఇవ్వలేదు ప్రభుత్వం.. కాగా, రాష్ట్రంలో కరోనా మరలా ప్రబలుతున్న కారణంగా ప్రభుత్వం గత నెల 7వ తేదీ నుంచి పలు ఆంక్షలను విధించింది.. ఇందులో భాగంగా పాఠశాలల మూత, శుక్ర, శని, ఆదివారాల్లో ప్రార్థనాలయాల్లో దర్శనాల నిలిపివేత, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ, ప్రతి ఆదివారం పూర్తి లాక్‌డౌన్ వంటి నిబంధనలను అమలు చేస్తూ వస్తుంది.. కోవిడ్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టడంతో… నిబంధనలను సడలించింది.. కొత్త నిబంధనల ప్రకారం వివాహాలకు వచ్చే అతిథుల సంఖ్య 100గా నిర్ణయించగా, అంత్యక్రియలకు 50 మందిని మాత్రమే అనుమతిస్తారు. ప్రార్థనా స్థలాలు అన్ని రోజులు తెరిచి ఉంచడానికి అనుమతించబడతాయి. హోటళ్లు, అతిథి గృహాలు 50 శాతం వినియోగదారులకు అనుమతిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.