కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. ఇప్పటికే దేశమంతా ఆందోళనలు, నిరసనలతో అట్టుడుకుతోంది. న్యాయం కోసం వైద్యులు, నర్సులు రోడ్డెక్కి పోరాటం చేస్తున్నారు. రెండు వారాల నుంచి ఉద్రిక్తతలు చోటుచేసుకుంటూనే ఉంటున్నాయి. ఇంత జరుగుతున్నా మృగాళ్లలో మార్పు కనిపించడం లేదు. తాజాగా తమిళనాడు నిట్ మహిళా హాస్టల్‌లో విద్యార్థినిపై వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. కాలేజీలో వైఫై సమస్యలను పరిష్కరించడానికి నియమించిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు.
తమిళనాడులోని తిరుచిరాపల్లిలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లోని హాస్టల్ గదిలో గురువారం రాత్రి తనను లైంగికంగా వేధించాడని విద్యార్థిని ఆరోపించింది. గత రాత్రి విద్యార్థిని గదిలో ఒంటరిగా ఉన్న సమయంలో నిందితుడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడని దర్యాప్తు అధికారులు తెలిపారు. ఈ సంఘటన నిరసనలకు దారితీసింది. నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ సంఘటన తర్వాత హాస్టల్ వార్డెన్‌ను మరో చోటికి బదిలీ చేశారు.
తిరుచ్చి కలెక్టర్ ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ.. కాలేజీలో భద్రతా లోపం ఏర్పడిందని చెప్పారు. మహిళా హాస్టల్‌లోకి పురుష వర్కర్‌ను అనుమతించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఇన్‌స్టిట్యూట్ అంతర్గత చర్యలు తీసుకుంటోందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. దీనిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహిళలు, బాలికలపై పెరుగుతున్న నేరాలపై అధికార డీఎంకే ఉక్కుపాదం మోపడం లేదని ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి మండిపడ్డారు.