Tamil Nadu: కార్తీక దీపం వేళ తమిళనాడులో హైటెన్షన్‌.. తిరుప్పరకుండ్రంలో ఆంక్షలు, బీజేపీ నేతల అరెస్ట్!

  • కార్తీక దీపం వేళ తమిళనాడులో హైటెన్షన్..
  • తిరుప్పరంకుండ్రంలో భారీగా మోహరించిన పోలీసులు..
  • కొండపై దీపం వెలిగించేందుకు సుప్రీంకోర్టు అనుమతి..
  • దీపం వెలిగిస్తే మతసామరస్యానికి దెబ్బ అని విజయ్ సర్కార్ వాదన..
Deepam Row

Deepam Row

Tamil Nadu: తమిళనాడులో తిరుప్పరంకుండ్రం ‘‘కార్తీక దీపం ’’ వివాదం కారణంగా హైటెన్షన్ నెలకొంది. సుప్రీంకోర్టు పవిత్రమైన తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న దీపతూన్(దీప స్తంభం) వద్ద దీపాన్ని వెలిగించేందుకు అనుమతి ఇచ్చింది. మరోవైపు, దీనిని ఎలాగైనా అడ్డుకోవాలని విజయ్ సర్కార్ చూస్తోంది. ఇప్పటికే సుప్రీంకోర్టు తీర్పుపై విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. నవంబర్ 24న సాయంత్రం కార్తీక దీపం వెలిగించే విషయంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.

తిరుప్పరంకుడ్రంలో హైటెన్షన్..

మరోవైపు, తమిళనాడు ప్రభుత్వం తిరుప్పరంకుండ్రంలో ఆంక్షలు విధించింది. కొండపై సుబ్రమణ్య స్వామి ఆలయంతో పాటు ఒక దర్గా ఉంది. దీంతో వివాదం నెలకొంది. అయితే, దీపం వెలిగిస్తే ఇది మత సామరస్యానికి, శాంతిభద్రతలకు సమస్యగా మారుతుందని విజయ్ ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో కొండ పరిసర ప్రాంతాల్లో మొత్తం 5,618 మంది పోలీసులను మోహరించారు. దక్షిణ తమిళనాడు జిల్లాలకు చెందిన 12 మంది ఎస్పీలు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. 70కి పైగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అనుమానాస్పద, సున్నితమైన ప్రాంతాల్లో బాంబు నిర్వీర్య బృందాలను ఏర్పాటు చేశారు.

బీజేపీ, హిందూ సంఘాల నేతలు అరెస్ట్..

మరోవైపు, బీజేపీ నేతలతో పాటు హిందూ సంస్థలకు చెందిన నాయకుల్ని నిర్బంధంలోకి తీసుకుంటున్నారు. తమిళనాడు బీజేపీ చీఫ్ నైనార్ నాగేంద్రన్‌ను గృహ నిర్బంధంలో ఉంచారు. తమ పార్టీకి చెందిన 750 మంది నాయకుల్ని, కార్యకర్తల్ని హౌజ్ అరెస్ట్ చేసినట్లు బీజేపీ ఆరోపిస్తోంది.

మదురై జిల్లా కలెక్టర్ నిషాంత్ కృష్ణన్ భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS)లోని సెక్షన్ 163 కింద జిల్లా వ్యాప్తంగా నిషేధాజ్ఞలు విధించారు. సభలు, ప్రదర్శనలు, ఊరేగింపులు, బహిరంగ సమావేశాలపై ఆంక్షలు విధించారు. తిరుప్పరంకుండ్రం కొండపైకి వెళ్లడంపైనా నిషేధం ప్రకటించారు. ఈ ఆదేశాలు సోమవారం రాత్రి 9 గంటల నుంచి నవంబర్ 25 ఉదయం 10 గంటల వరకు అమల్లో ఉంటాయి.

విజయ్ ప్రభుత్వ నిర్ణయానికి కాంగ్రెస్ మద్దతు..

సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ, కార్తీక దీపం వెలిగించేందుకు ప్రభుత్వం నిరాకరిస్తోంది. ఈ నేపథ్యంలో హిందూ సంస్థలు, బీజేపీ టీవీకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తోంది. డీఎంకే లాగే టీవీకే కూడా హిందూ వ్యతిరేక పార్టీ అని ఆరోపిస్తోంది. మరోవైపు, విజయ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ సమర్ధించింది. ఆర్‌ఎస్‌ఎస్‌, హిందూ మున్నాని, బీజేపీ సంస్థలు మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని కాంగ్రెస్ నేత మాణికం ఠాగూర్ ఆరోపించారు.

వివాదం ఏమిటి..

తిరుప్పరంకుండ్రం కొండపై సికిందర్ బాదుషా దర్గా సమీపంలో పురాతన రాతి స్తంభం వద్ద కార్తీక దీపం వెలిగించే విషయంలో వివాదం ఉంది. ఈ అంశంపై 2025 నవంబర్‌లో అప్పటి డీవీకే ప్రభుత్వం దీపం వెలిగించేందుకు నిరాకరించింది. శాంతిభద్రతలను సమస్యలుగా ప్రస్తావించింది. దీనిపై భక్తుడు రామ రవికుమార్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు దీపం వెలిగించేందుకు అనుమతి ఇచ్చింది.

హైకోర్టు ఉత్తర్వుల్ని విజయ్ సర్కార్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. నవంబర్ 20న విచారణ జరిపిన సుప్రీంకోర్టు, నవంబర్ 24 ఒక్క రోజు మాత్రమే దీపతూర్ వద్ద దీపం వెలిగించేందుకు అనుమతి ఇచ్చింది. కానీ, ప్రభుత్వం మాత్రం దీపం విషయంలో సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది.