Tamil nadu Honor killing, father killed daughter: తమిళనాడులో పరువు హత్యలు కలకలం రేపుతున్నాయి. పరువు హత్యలకు సంబంధించి ఇటీవల కాలంలో పలు సంఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా మరో పరువు హత్య తమిళనాడులో చర్చనీయాంశంగా మారింది. తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని కూతురును, అల్లుడిని దారుణంగా హత్య చేశాడు ఓ తండ్రి. ఈ ఘటనల తూత్తుకూడి జిల్లాలో జరిగింది.
తూత్తూకూడి జిల్లా వీరపట్టి సమీపంలోని జేవియర్ నగర్ కు చెందిన ఎం రేష్మ(20), వీ. మాణిక్క రాజు(28)లు గత కొంత కాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరు ఒకే వీథిలో నివసిస్తుండటంతో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఈ నేపథ్యంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారైనా కూడా పెద్దవాళ్లు తమ ప్రేమ పెళ్లికి ఒప్పుకోరని.. ఇటీవల మధురై సమీపంలోని తిరుమంగళంలో పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి పెళ్లిని రేష్మ తండ్రి మత్తు(43) మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్న కూతురు రేష్మ దంపతులపై కక్ష పెంచుకున్నాడు.
Read Also: Crime in Uttar Pradesh: ఒకరిపై వేధింపులు.. మరొకరిపై అనుమానం.. యూపీలో దారుణం..
లారీ డ్రైవర్ అయిన ముత్తుకుట్టి, కూతురు రేష్మకు పెళ్లి నిశ్చయించే పనిలో ఉన్నాడు. ఈ లోపే జూన్ 28న మానిక్క రాజుతో రేష్మ పారిపోయింది. ఈ ఘటనపై ఎట్టయ్యపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా నమోదు అయింది. ఇదిలా ఉండగా.. మధురైలో పెళ్లి చేసుకున్న తరువాత వారం రోజుల క్రితం రేష్మ, మాణిక్క రాజు సొంతూరు వీరవట్టికి తిరిగి వచ్చారు. ఈ నేపథ్యంలో సోమవారం దంపతులు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయం చూసి ముత్తు కుట్టి రేష్మ గొంతు కోశాడు.. అల్లుడు మానిక్క రాజును నరికి చంపాడు. ఇద్దరూ అక్కడిక్కడే మరణించారు.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. పెళ్లి తరువాత పోలీసులు ఇరు కుటుంబాలకు నచ్చ చెప్పినట్లు తెలుస్తోంది. రేష్మ మేజర్ కావడంతో పోలీసులు కూడా ఆమె ఇష్టానికి గౌరవం ఇవ్వాలని సూచించారు. అయితే దంపతులకు ప్రాణహాని ఉందని.. సొంతూరుకు రావద్దని సూచించామని.. అయితే ఇటీవల పోలీసులకు సమాచారం ఇవ్వకుండా వచ్చారని పోలీసులు తెలిపారు. సంఘటన స్థలాన్ని తూత్తుకూడి ఎస్పీ ఎల్ బాలాజీ శరవణన్ పరిశీలించారు. నిందితుడి ఆచూకీ కోసం స్నిఫర్ డాగ్ స్వ్కాడ్, ఫోరెన్సిక్ టీం రంగంలోకి దిగింది. మృతదేశాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.